హైదరాబాద్: ఫార్ములా వన్ తర్వాత అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. దీంతో హుస్సేన్‌సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది. ప్రధాన రేసుకు ముందు ప్రాక్టీస్ రేసులు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా రెండో ప్రీ ప్రాక్టీస్ రేటు ప్రారంభమైంది. 30 నిమిషాలపాటు ప్రాక్టీస్ కొనసాగనుంది. ఇక ఉదయం 10.40 గంటలకు అర్హత పోటీలు నిర్వహించనున్నారు. అందులో క్వాలిఫై అయిన రేసర్లు.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేసులో చాంపియన్‌షిప్ కోసం తలపడనున్నారు.
హుసేన్సాగర్ తీరప్రాంతంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించనున్నారు. దాదాపు 21 వేల మంది పోటీలను వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో రేసింగ్ నిర్వహించే ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, మింట్‌కాంపౌండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా మూసివేశారు. 300 మంది సివిల్, 270 మంది ట్రాఫిక్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి మరో 600 మంది పోలీసులు నియమించారు.
రేసింగ్ షెడ్యూల్..
ఉ: 10.40 నుంచి 12.05 వరకు క్వాలిఫయింగ్ రేసు
మ: 1.40 నుంచి 1.55 వరకు డ్రైవర్స్ పరేడ్
మ: 3.04 నుంచి ప్రధాన రేసు
సా: 4.35- మీడియా సమావేశం