హైదరాబాద్, జనవరి 27 (నమస్తేతెలంగాణ): సీపీఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరి రోజు మంగళవారం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగనుంది. అనంతరం నూతన రాష్ట్ర కార్యదర్శిని ఆ కమిటీ ఎన్నుకోనుంది.
మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి (నల్లగొండ), రాష్ట్ర కమిటీ సభ్యులు (వరంగల్), సీనియర్ నాయకులు జాన్వెస్లీ (మహబూబ్నగర్) బరిలో ఉన్నారు. వీరిలో జూలకంటి రంగారెడ్డి ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా, పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా, సీఐటీయూ కార్మిక సంఘం నేతగా పనిచేశారు. దీంతో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకునే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
కాగా స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత అగ్రవర్ణాలకు చెందిన తమ్మినేని వీరభద్రం మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శి పదవి చేపట్టినందున.. ఈ సారి బలహీనవర్గాలకు అవకాశం కల్పిస్తే ఎస్ వీరయ్యకు ఆ పదవి దక్కే చాన్స్ ఉంది. అలా కాకుండా ముగ్గురు సభ్యులు గట్టిగా పట్టుపడితే రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఈనెల 25న బహిరంగ ప్రదర్శనతో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆది, సోమవారాల్లో జాతీ య, రాష్ట్ర నాయకుల ఉపన్యాసాలు, పలు అంశాలపై తీర్మానాలు జరిగాయి.