Gandra Venkataramana Reddy | శాయంపేట, నవంబర్ 30 : ‘ముద్దలా ఉన్న అన్నం మీరు తింటరా? మనమైతే ఇంట్లో ఈ తిండి తింటామా? చెప్పండి’ అని శాయంపేట మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర గురుకులం ప్రిన్సిపాల్ రేవతిని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. పిల్లలకు కనీసం ఆరు నెలల పాత బియ్యం ఇవ్వాల్సింది పోయి కొత్త బియ్యం ఇస్తే తింటరా? ప్రభుత్వానికి చెప్పండి.. అని సూచన చేశారు. బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర శనివారం హనుమకొండ జిల్లా శాయంపేటలోని జ్యోతిబాఫూలే బాలుర గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకుల స్కూళ్లల్లో ఫుడ్‌పాయిజన్ జరిగి విద్యార్థులు చనిపోవడం బాధాకరమని అన్నారు. 7వ తేదీ వరకు బీఆర్ఎస్ నిర్వహించనున్న గురుకుల బాటతో సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 9 నుంచి అసెంబ్లీ ఉన్నదని, అందులో సమస్యలను లేవనెత్తుతామని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పెద్దకోడెపాక హైస్కూల్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్కూల్లో నాణ్యమైన భోజనం అందకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచి టిఫిన్ బాక్సులను తెచ్చుకోవడం బాధాకరమని అన్నారు.