హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారా? దానికి ఉన్నత విద్య చదివేందుకు పరిస్థితులు అనుకూలించక బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. ఇంటర్ చదివితే చాలు.. సాఫ్ట్వేర్ కొలువు సాధించొచ్చు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్.. టెక్బీ (TECH B) అనే ప్రత్యేక కోర్సు (ప్రోగ్రాం)ను ప్రవేశపెట్టింది. ఇంటర్ పూర్తికాగానే ఏడాది శిక్షణతో సాఫ్ట్వేర్ ఉద్యోగంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేకతలున్న ఈ కోర్సు అనతికాలంలోనే విస్తృత ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం నోయిడా, చెన్నై, లక్నో, నాగపూర్, విజయవాడ, హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ కంపెనీల్లో ఈ కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు. ఐటీ పరిశ్రమకు కేరాఫ్ అయిన తెలంగాణలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ కోర్సులో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ కోర్సులో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం ఆసక్తి ఉన్న వారిని గుర్తించి, దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు సాంకేతిక విద్య, ఇంటర్ విద్య అధికారులు, డీఆర్డీఏ విభాగం ద్వారా విస్తృత ప్రాచుర్యం కల్పిస్తూ, నమోదును పెంచేందుకు కృషిచేస్తున్నారు.
శిక్షణ ఇలా..
ఏడాది వ్యవధి ఉన్న ఈ ప్రోగ్రాంలో మొదటి ఆరు నెలలు క్లాస్‌రూం ట్రైనింగ్, చివరి ఆరు నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు ప్రతి నెల రూ.10వేల చొప్పున ైస్టెపెండ్ ఇస్తారు. కోర్సు ఫీజు రూ.1.18లక్షలు చెల్లించాలి. ఆర్థిక స్థోమత లేనివారు యాక్సిస్‌బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు.
ప్లేస్మెంట్ ఇలా..
శిక్షణ పూర్తయిన తర్వాత హెచ్‌సీఎల్ కంపెనీలోనే సాఫ్ట్వేర్ డెవలపర్, డిజైన్ ఇంజినీర్, టెక్ అనలిస్ట్, డాటా ఇంజినీర్, సపోర్ట్ అండ్ ప్రాసెస్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. సంవత్సరానికి ప్రారంభవేతనం రూ.1.7 లక్షల నుంచి 2.2 లక్షల వరకు చెల్లిస్తారు. తర్వాత హోదాను బట్టి వేతనాలు పెంచుతారు.
ఉన్నత చదువులకు అవకాశం
ఆసక్తి ఉన్న వారు ఉద్యోగం చేస్తూనే బిట్స్, అమిటీ, శస్త్ర యూనివర్సిటీల్లో చదువుకోవచ్చు. హైదరాబాద్‌లోని బిట్స్ క్యాంపస్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరవచ్చు. ఇందుకయ్యే ఖర్చులను కొంతమేర హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ భరిస్తుంది.
అర్హతలు..
ఇంటర్లో ఎంపీసీ, ఎంఈసీ కోర్సుల్లో 60% మార్కులు వచ్చి ఉండాలి. గణితంలో 60% మార్కులు తప్పనిసరి. ఏడాది వ్యవధి ఉన్న ఈ ప్రోగ్రాంను హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యాంపస్‌లో పూర్తిచేయొచ్చు. ఇంటర్‌ను 2021 లేదా 2022లో పూర్తిచేసిన వారు అర్హులు.
ఆగస్టు మూడో వారంలో ఎగ్జామ్
ఆగస్టు మూడో వారంలో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాలకు https://bit.ly/HCLTB-Telanganaను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. కెరీర్ ఆప్టిట్యూట్ టెస్డ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో క్వాంటిటేటివ్, లాజిక్ రీజనింగ్, ఇంగ్లిష్ ఎబిలిటీ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలుంటాయి. అర్హత అనంతరం ముఖాముఖి ఇంటర్వ్యూలుంటాయి.