హైదరాబాద్: పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (PSKs), పాస్‌పోర్టు ఆఫీస్ సేవా కేంద్రాల్లో (POSKs) కొత్త పాస్‌పోర్టుల కోసం, పాస్‌పోర్టుల రెన్యువల్ కోసం వచ్చే వినియోగదారులు గంటల తరబడి ఎదురుచూసే పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించేందుకు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి రెండు వారాలపాటు ఎప్పుడూ ఇచ్చే రోజువారీ పాస్‌పోర్టు అప్పాయింట్మెంట్స్కు అదనంగా.. మరో 500 అప్పాయింట్మెంట్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం హెడ్ దాసరి బాలయ్య ఇవాళ ఒక ప్రకటన చేశారు. ఏప్రిల్ 27కు సంబంధించిన 500 అదనపు అప్పాయింట్మెంట్స్.. పాస్‌పోర్టు సేవా వెబ్సైట్లో ఇవాళ (ఏప్రిల్ 25) సాయంత్రం నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పాస్‌పోర్టు ఆఫీస్ సేవా కేంద్రాలను మూసి ఉంచారు. దాంతో ఆ రోజు అప్పాయింట్మెంట్స్ తీసుకున్నవారు సేవలను పొందలేకపోయారు.
పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో వినియోగదారుల రద్దీ భారీగా పెరగడానికి ఇది కూడా ఒక కారణమయ్యింది. కాబట్టి ఇప్పటికే పాస్‌పోర్టుల కోసం రిజిస్టర్ చేసుకున్నవాళ్లు, చేసుకుంటున్న వాళ్లు ఈ అదనపు 500 అప్పాయింట్మెంట్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దాసరి బాలయ్య కోరారు. www.passportindia.gov.in వెబ్సైట్ ద్వారా లేదా mPassportseva మొబైల్ అప్లికేషన్ ద్వారా లేదా PSKs, POSKs లను నేరుగా సంప్రతించడం ద్వారా అదనపు 500 అప్పాయింట్మెంట్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు.