న్యూస్‌నెట్‌వర్క్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కన్నెర్రజేస్తున్నారు. ఇతరుల మనోభావాలను కించపరిచేలా, నిరాధారమైన, అసభ్యకర వ్యాఖ్యలు, పోస్టులు పెడుతున్నవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే విచారించి, కేసులు నమోదు చేస్తున్నారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికల్లో వేధింపులకు గురవుతున్న రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు, సామాన్యులు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా, పోస్టులు పెట్టినా ఫిర్యాదులు అందిన వెంటనే ఐటీ యాక్టు 67, 66డీ, ఐపీసీ 506, 504, 505, 505(1), 505(2), 153(ఏ), 509 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేస్తామని పోలీసు కమిషనర్లు హెచ్చరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బాలానగర్, జవహర్‌నగర్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతాల్లో పలువురిపై కేసులు నమోదుచేసి, అదుపులోకి తీసుకొన్నారు. రాష్ట్రప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్ కుటుంబాన్ని, ఎమ్మెల్సీ కవితను కించపరుస్తూ, నిరాధారమైన ఆరోపణలతో ఇష్టానుసారంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్న అమీర్‌పేటలోని మధురానగర్‌కు చెందిన బొమ్మ శరత్‌గౌడ్, దాసరి శ్రీనివాస్‌ను బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వీరు కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్వీ కార్యకర్త జే రాజేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేసినట్టు సీఐ ఎండీ వహీద్దీన్ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుపై ట్విట్టర్, ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేసిన హైందవరెడ్డిపై జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదుచేశారు. హైందవరెడ్డిపై టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి సుజాతాగౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు సీఐ కే చంద్రశేఖర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో విలేకరులుగా చలామణి అవుతూ, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన కేసులో హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లికి చెందిన జీఎస్ఆర్ టీవీ యూట్యూబ్ చానల్ యజమాని గుండా శివరాంరెడ్డి, చిన్నపాపయ్యపల్లికి చెందిన రైట్వాయిస్ చానల్ నరెడ్ల ప్రవీణ్‌రెడ్డిని అరెస్టు చేసినట్టు కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. షాద్‌నగర్‌కు చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి రాజావరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీఎస్ఆర్ టీవీ యూట్యూబ్ చానల్ యజమాని శివరాంరెడ్డితోపాటు బోడ రాజుపై కేసులు నమోదుచేసినట్టు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్నవారు స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేయాలి. వాస్తవాలు పరిశీలించి పోలీసులు కేసు నమోదుచేస్తారు. నిందితులు ఎక్కడున్నా పట్టుకుంటాం.
–సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ