హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణ జీవో 84పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ జీవో అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని సూచించి, తదుపరి విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. జూలై 28న జారీ చేసిన జీవో 84ను సవాల్ చేస్తూ భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యానికి నెంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారించింది. 125 చదరపు గజాలు, అంతకంటే తకువ విస్తీర్ణంలో కట్టుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది నరేంద్రనాయక్ చెప్పారు.
125 గజాల వరకు స్టాంపు డ్యూటీ, జరిమానా ఉండదని, అంతకు మించిన స్థలాలకు ప్రస్తుత మారెట్ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ వసూలు చేస్తామని జీవో జారీ చేసిందని చెప్పారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, అనేక వివాదాలకు ఆసారం ఉంటుందని పేర్కొన్నారు. స్టాంప్ డ్యూటీ మినహాయింపుతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వస్తుందని, జీవోను కొట్టేయాలని కోరారు. ప్రభుత్వ వాదనలతో సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్ కోరారు. అందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. పిటిషనర్ రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది.