LLB Course | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): న్యాయవిద్య కోర్సుల ఫీజులు పెరిగాయి. మూడేండ్ల లా కోర్సు గరిష్ఠ ఫీజును రూ.42 వేలు, కనిష్ఠ ఫీజును రూ.20వేలుగా టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. 2025-28 మూడేండ్ల కోర్సు ఫీజులను ఖరారు కోసం టీఏఎఫ్ఆర్సీ శనివారం విచారణ జరిపి, ఈ మేరకు పెంపుపై నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 22 న్యాయ కళాశాలలున్నాయి. వీటిలో మూడేండ్ల, ఐదేండ్ల కోర్సులను అందిస్తున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజు ఖరారుపై టీఏఎఫ్ఆర్సీ ఈ నెల 24 నుంచి 26 వరకు విచారణ జరపనుంది. దాదాపు 130 కాలేజీలు 15శాతం ఫీజు సవరణకు దరఖాస్తు చేసుకున్నట్టు
తెలుస్తున్నది.
పది పరీక్షలకు 1,615 మంది గైర్హాజరు
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలకు శనివారం 99.70శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 1,615 మంది గైర్హాజరయ్యారు. శనివారం రెండో భాష పేపర్‌కు పరీక్షను నిర్వహించగా, 4,97,088 మంది రెగ్యులర్ విద్యార్థులకు 4,95,590 మంది పరీక్షకు హాజరైనట్టు, 1,498 మంది గైర్హాజరైనట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ప్రైవేట్ విద్యార్థులు 226 మందికి 109 మంది హా జరు కాగా, 117మంది గైర్హాజరైనట్టు ఆయన వెల్లడించారు.
రేపటి నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తులు
హైదరాబాద్, మార్చి 22(నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ డీఈఈసెట్-25 నోటిఫికేషన్ విడుదలైంది. 2025-27 విద్యాసంవత్సరానికి రెండేండ్ల వ్యవధి కోర్సుల్లో ప్రవేశాలకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎస్సీఈఆర్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం(మార్చి 24) నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు deecet. cdse. telangana.gov.in సంప్రదించాలి.