గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 11, 2020 , 01:46:44

భవిష్యత్‌పైనే భయం

భవిష్యత్‌పైనే భయం

  • ప్రస్తుతానికి అగ్రరాజ్యంలో తెలుగువారు క్షేమం
  • స్వీయ గృహనిర్బంధంలోనే అత్యధికులు
  • తెలుగువారి యోగక్షేమాలపై సంఘాల దృష్టి
  • స్థానికంగా సాయం అందించేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న మెజారిటీ తెలుగువారు క్షేమంగా ఉన్నప్పటికీ, భవిష్యత్‌పైనే భయం పట్టుకున్నది. కరోనా వైరస్‌.. ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తరుణంలో పరాయిదేశంలో ఉన్న మనవాళ్లు ఎలా ఉన్నారన్న ఆతృత ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ నుంచి గల్ఫ్‌ తర్వాత అత్యధికులు వెళ్లింది అమెరికాకే. అక్కడ సాఫ్ట్‌వేర్‌, వ్యాపారరంగాల్లో స్థిరపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో వేల మంది తెలంగాణవారు, తెలుగువారున్నారు. కొవిడ్‌ అమెరికాను అతలాకుతలం చేస్తుండటంతో చాలా రాష్ర్టాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, లూసియానా, మిషిగన్‌లలో కరోనా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో పరిస్థితి ఎలా ఉందన్నదానిపై అమెరికాలోని పలువురిని ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. పరిస్థితులు అంత సజావుగా ఏమీలేవన్న వారు.. ఒకటి అర మినహా మెజార్టీ తెలుగువారు క్షేమంగానే ఉన్నారని, స్వీయ గృహనిర్బంధం పాటిస్తున్నారని చెప్పారు.

ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందిలేదు

కరోనా ప్రభావం అమెరికాలో ఊహించినదానికన్నా ఎక్కువే ఉన్నది. న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ర్టాల్లో అనేక మందికి పాజిటివ్‌ వచ్చింది. చాలామంది చనిపోతున్నారు.  తెలుగువారికి ఇప్పటికైతే ఎలాంటి సమస్య రాలేదు. తెలుగువారు నెలరోజుల ముందునుంచే సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్వీయ గృహనిర్బంధం పాటిస్తున్నారు. అత్యవసర వస్తువులన్నీ అందుబాటులో ఉన్నాయి.  ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే భోజనం సరఫరా చేసే ఫుడ్‌ చైన్‌లు పనిచేస్తున్నాయి.

- పరమేశ్‌ భీంరెడ్డి, అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) అధ్యక్షుడు

ఇక్కడ ఇండియన్స్‌కే వ్యాధులెక్కువ

అమెరికన్లతో పోలిస్తే ఇక్కడ నివసించే భారతీయుల్లో గుండె సంబంధ, మధుమేహ వ్యాధులు ఎక్కువ. ఇప్పటివరకైతే మనవాళ్లకు కరోనా పెద్దగా సోకలేదు. ఇక్కడ రకరకాల పరీక్షలు చేస్తున్నారు. రోగులకు డాక్టర్లు టెలిమెడిసిన్‌ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. కరోనా లక్షణాలున్నవారు పరీక్షలు చేయించుకొంటున్నారు. భారత్‌లో  లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలే వస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం.

- డాక్టర్‌ నందిని సుంకిరెడ్డి, అట్లాంట (జార్జియా)

న్యూజెర్సీ, న్యూయర్క్‌లలో పరిస్థితులు దారుణం

న్యూజెర్సీ, న్యూయర్క్‌లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మన తెలుగువాళ్లు చాలామంది ముందునుంచే వర్క్‌ ఫ్రం హోంలో ఉన్నారు. దీంతో వారికి  వైరస్‌ సోకలేదు. తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా చేయూత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా) ద్వారా 20 వేల మాస్కులను పంపిణీ చేస్తున్నాం.  డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు.. ప్రాణాలు ముఖ్యమని సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలు మా గుండెలను తాకాయి.

- అమర్‌నాథ్‌ గుండా, మోర్స్‌టౌన్‌ (న్యూజెర్సీ)

భవిష్యత్‌పైనే చాలా మంది ఆందోళన

ప్రస్తుత పరిస్థితి కన్నా  కరోనా తగ్గిన తర్వాత రోజులు ఎలా ఉంటాయనేదానిపైనే చాలామంది ఆందోళన చెం దుతున్నారు. ఇమ్మిగ్రేషన్‌, వీసా సమస్యలు రావచ్చు. ఉద్యోగాలు ఉంటాయో.. పో తాయో అన్న భయం ఉన్నది. తెలుగువాళ్లకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తు న్నాం. ప్రజలంతా ఎవరికివారు జాగ్రత్తలు పాటిస్తున్నారు. రోడ్లపై జనసంచారం పూర్తిగా తగ్గింది.

విశ్వేశ్వర్‌రెడ్డి కలువాల, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం మాజీ అధ్యక్షుడు


logo