యాచారం, అక్టోబర్ 8 : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీ బైపాస్ (తోళ్లగుట్ట) రోడ్డు పనులను రైతులు గురువారం అడ్డుకున్నారు. మేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 202సర్వే నంబర్లో మేడిపల్లికి చెందిన చంద్రారెడ్డి, పల్లెచెల్క తండాకు చెందిన విస్తావత్ నందుకు చెరో ఎకరా పొలం ఉన్నది.
ఈ పొలం భూమిని ఫార్మా భూసేకరణలో భాగంగా అధికారులు సేకరించి, బైపాస్ రోడ్డు పనులను గుట్టు చప్పుడు కాకుండా ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు తమ భూముల నుంచి రోడ్డు ఎలా నిర్మిస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు పనులు వేయకుండా అక్కడే గుడిసె వేసుకొని బైఠాయించారు. మీర్ఖాన్పేట పోలీసులు వచ్చి గుడిసెను తొలగించాలని హెచ్చరించినా రైతులు మాత్రం పరిహారం అందించేంత వరకు తొలగించేదిలేదని భీష్మించారు.
దీంతో రైతులను బలవంతంగా అరెస్ట్ చేశారు. రైతులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి, నాయకుడు కానమోని గణేశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మీర్ఖాన్పేట పీఎస్ పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు బాధిత రైతులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.