మాగనూర్ : నారాయణ పేట జిల్లా మాగనూర్ ఉమ్మడి మండలంలో గన్నీ బ్యాగుల సమస్య ( Gunny bags Problem ) తీవ్రంగా ఉందని రైతులు ఆరోపించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి( MLA Srihari ) , నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ( Collector Sikta Patnaik ) రైతులు మొరపెట్టుకున్నారు.
మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు, కృష్ణ మండల కేంద్రాల్లో సోమవారం భూ భారతి కొత్త రెవెన్యూ చట్టం అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే, కలెక్టర్కు తమ సమస్యలను వినిపించారు. ప్రధానంగా మాగనూరు మండలంలో 14వేల ఎకరాల వరి ధాన్యం, కృష్ణా మండలంలో 12,500 ఎకరాల్లో వరి ధాన్యం పండించిన రైతులకు కావాల్సిన సంఖ్యలో గన్నీ బ్యాగులను అందించలేదని ఆరోపించారు. గన్నీ బ్యాగుల కొరతతో అనేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం ఆదివారం కురిసిన ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిపోయిందని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు తగిన న్యాయం కోరారు. ధాన్యం సేకరణ తరువాత లారీ డ్రైవర్లు లంచాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రైతుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ 9963471959 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
సమావేశంలో నారాయణపేట ఆర్డీవో రామచందర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, మాగనూరు, కృష్ణ మండలాల తహసీల్దార్లు వెంకటేష్, సురేష్ కుమార్, ఎంపీడీవోలు జానయ్య, ఉమ్మడి మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్, వివిధ శాఖల సంబంధిత అధికారులు, రైతులు , తదితరులు పాల్గొన్నారు.