సంప్రదాయ సేద్యానికి భిన్నంగా ఇతర పంటలు సాగు చేయాలన్న ఆకాంక్ష ఉన్న రైతులకు కొండంత అండగా నిలుస్తున్నది సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట గ్రామ రైతు వేదిక. ‘రండి విభిన్నంగా వ్యవసాయం చేయండి.. అండగా మేముంటాం’ అనే నినాదంతో యువ రైతులను ఉత్సాహపరుస్తున్నది. గ్రామ రైతులు, వ్యవసాయ అధికారులు కలిసి ఈ రైతువేదికను వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. వ్యవసాయంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎన్జీవోలతో ఒప్పందం చేసుకొన్నారు. గానుగ నూనె పరిశ్రమను ఏర్పాటు చేయించి యువతకు ఉపాధి కల్పించారు. రైస్‌మిల్లును నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్నారు.
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): వరి, ఇతర సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆలోచించే రైతులకు నారాయణరావుపేట రైతువేదిక దిక్సూచిగా మారుతున్నది. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను రైతులతో ఏర్పాటు చేయించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ రైతు వేదిక మొత్తం 18 అంశాల్లో రైతులను ప్రోత్సహిస్తున్నది. ఈ జాబితాలో పందిర్లపై కూరగాయల సాగు, వెదురు చెట్ల పెంపకం, పట్టు పరిశ్రమ, సుగంధ ద్రవ్యాల సాగు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు తదితర అంశాలు ఉన్నాయి. వీటిని ఎంచుకున్న రైతులకు అవసరమైన సహాయం, సూచనలు, ప్రోత్సాహం అందిస్తున్నది. ఆయా అంశాల్లో ఔత్సాహిక రైతులకు సూచనలు, సలహాలు, శిక్షణ ఇచ్చేందుకు ఆ ప్రాంతంలో 12 రకాల పంటలను సాగుచేస్తున్న అనుభవజ్ఞులైన రైతులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని రైతులంతా కలిసి యువ రైతులను వినూత్న ఆలోచనల వైపు ప్రోత్సహించనున్నారు.
బ్యాంకింగ్, ఇతర శాఖల అధికారులతో కమిటీ
విభిన్న పంటల సాగు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అనుభవజ్ఞుల సూచనలతో పాటు ఆర్థిక సాయం కూడా చాలా అవసరం. రైతులకు రుణాలు ఇప్పించడంతో పాటు, అవసరమైన సూచనలు ఇచ్చేందుకు బ్యాంకింగ్, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో వ్యవసాయశాఖ నుంచి ఏఈవో, ఉద్యానశాఖ నుంచి ఎంహెచ్ఎం, పశు సంవర్థకశాఖ నుంచి ఇద్దరు ఏహెచ్వోలు, సెరికల్చర్ నుంచి ఏఎస్వో సభ్యులుగా ఉంటారు. ఏ పంటలకు, ఎంత రుణం వస్తుంది? రుణం ఎలా పొందాలి? తదితర అంశాలపై ఈ కమిటీ రైతులకు సూచనలు, సలహాలు ఇస్తుంది.
18 అంశాలకు ప్రాధాన్యం
యువ రైతులను, వ్యవసాయంలో నూతన ఆలోచనలను ప్రోత్సహించేందుకు నారాయణరావుపేట గ్రామ రైతు వేదిక 18 అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నది. వీటిలో సేంద్రియ వ్యవసాయం, సమీకృత వ్యవసాయం, పందిరిపై కూరగాయల సాగు, పాలీహౌస్లో కూరగాయలు, పూల మొక్కల సాగు, డ్రాగన్‌ఫ్రూట్ సాగు, అధిక సాంద్రత పద్ధతిలో మామిడి, జామ సాగు, వెదురు చెట్ల పెంపకం, పట్టు పరిశ్రమ, మేలు జాతి పశువుల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, చేపలు, కొర్రమీనుల పెంపకం, బ్రాయిలర్ కోళ్లు, నాటు కోళ్ల పెంపకం, గ్రామీణ ఆవిష్కరణలు, విత్తనోత్పత్తి, తేనెటీగల పెంపకం, సుగంధ ద్రవ్యాల సాగు(నిమ్మగడ్డి), ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల (గానుగ, మినీ దాల్ మిల్లు, రైస్‌మిల్లు) ఏర్పాటు ఉన్నాయి.
యువతను వ్యవసాయం వైపు ప్రోత్సహించేందుకు
విభిన్న పంటలు సాగు చేయాలన్న ఆసక్తి ఉన్న రైతులకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. యువతను వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వైపు ప్రోత్సహించాలన్నది మా లక్ష్యం. ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన రైతు వేదికలు రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. చాలామంది యువ రైతులు ముందుకొస్తున్నారు.
–టీ నాగార్జున్, ఏఈవో, నారాయణరావుపేట