హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌లోని సీటీసీ కాంప్లెక్స్‌లో గల గోదాములో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హైదరాబాద్ శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. నకిలీ గృహోపకరణాలు నిల్వచేశారనే సమాచారంతో జరిగిన ఈ సోదాల్లో దాదాపు రూ.8 లక్షల విలువైన వస్తువులను జప్తు చేశారు. వాటిలో బీఐఎస్ ధ్రువీకరణ పొందని, నకిలీ ఐఎస్ఐ ముద్రలతో కూడిన మిక్సర్లు, ప్రెషర్ కుక్కర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఇస్త్రీ పెట్టెలు తదితర 225 గృహోపకరణాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వాటిని నిల్వచేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బీఐఎస్ చట్టం-2016లోని సెక్షన్ 17 ప్రకారం 679 రకాల వస్తువులకు బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి. బీఐఎస్ ధ్రువీకరణ లేని ఉత్పత్తులు తయారుచేసినా, విక్రయించినా, నిల్వ చేసినా తొలిసారి పట్టుబడితే రెండేండ్ల జైలు శిక్ష , రూ.2 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే ఐదేండ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల వరకూ
జరిమానా విధిస్తారు.