హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: ‘హలో.. నమస్కారమండీ! నేను ఏసీబీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నరేందర్కుమార్రెడ్డి. ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను. మీరు ఇరిగేషన్ ఏఈ గారా? ఇక్కడ ఎన్నిరోజుల నుంచి పనిచేస్తున్నారు? మీరు లంచాలు తీసుకుని అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు మీ ఆఫీసు నుంచి రెండు ఫిర్యాదులు వచ్చాయి.మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడి క్లియర్ చేసుకుంటామంటే క్లియరెన్స్ ఇస్తా. ప్రాబ్లం లేదు చూసుకుంటానంటే రైడ్స్‌కు పంపుతాం అంటూ పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను ఒక ఘరానా మోసగాడు ఏసీబీ అధికారి ముసుగులో బెదిరింపులకు పాల్పడి కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.
ఏపీలోని అనంతపురం జిల్లా చెత్తేటి జయకృష్ణ అలియాస్ జయ (28) ప్రైవేట్ ఉద్యోగి. బెంగళూరు కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్న ఈ నిందితుడిపై శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణగౌడ్ తన బృందంతో నెల పాటు బెంగళూరులో మకాం వేసి నిందితుడి ఆచూకీని గుర్తించి, అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. నిందితుడు గూగుల్‌లో అధికారుల నంబర్లు వెతికి ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డి, ఎస్వోటీ డీసీపీ బషీర్ తెలిపారు. ఇతడిపై ఏపీలో 34, తెలంగాణలో 3 కేసులు నమోదయ్యాయని వివరించారు. తెలుగు రాష్ర్టాల్లో 15 జిల్లాలు, 20 శాఖల అధికారులను ఇతడు టార్గెట్ చేశాడని తెలిపారు. జయకృష్ణ వద్ద రూ.85 వేల నగదు, 8 సెల్ఫోన్లు, 5 సిమ్‌కార్డులు, 3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.2.24 లక్షలను ఫ్రీజ్ చేసినట్టు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన సిబ్బందిని అభినందించారు.