Heavy Rains | తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. తాజాగా వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరో ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తాంధ్రను ఆనుకొని తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సగటున 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. అలాగే, వాయువ బంగాళాఖాతాన్ని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది.
ఈ క్రమంలో రాగల ఐదురోజులు తెలంగాణలో అతిభారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వానలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని చెప్పింది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
గురువారం భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాద్రాది భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా పెద్దగోపటిలో 11.4, యాదాద్రి భువనగిరిలోని బీబీనగర్‌లో 9.8, బొమ్మలరామారంలో 9.1, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 9.1, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 9.3 సెంటీమీటర్ల భారీ వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.