హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్6(నమస్తే తెలంగాణ): ఆసియా, పసిఫిక్ ప్రాంత వైద్యులతో నైపుణ్యాలను విస్తరించుకొంటున్నట్టు యశోద దవాఖాన డైరెక్టర్ (మెడికల్ సర్వీసెస్) డాక్టర్ ఏ లింగయ్య తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో శిక్షణ, పరిశోధన కోసం జపాన్‌కు చెందిన ఫుజి ఫిల్మ్ ఇండియాతో కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో జరిగిన ఒక కార్యక్రమంలో డాక్టర్ ఏ లింగయ్య, టోక్యోకు చెందిన ఫుజి ఫిల్మ్ కార్పొరేషన్ ఎండోస్కోపీ విభాగపు గ్లోబల్ హెడ్ డాక్టర్ తట్సుహికో సైకి, డిపార్ట్మెంట్ హెడ్ ధీరజ్ చౌదరితో కలిసి ఎంఓయూపై సంతకాలు చేశారు. ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఇమేజింగ్‌లో ప్రపంచస్థాయి బోధన, శిక్షణ, పరిశోధన రంగాల్లో యశోద హాస్పిటల్స్, జపాన్ ఫుజి ఫిల్మ్‌తో భాగస్వామ్య పద్ధతిలో పనిచేయనున్నట్టు ప్రకటించారు.
ఫుజి గ్లోబల్ హెడ్ తట్సుహికో సైకి మాట్లాడుతూ ఫుజి ఫిల్మ్ కార్పొరేషన్ ఆరోగ్య సంరక్షణలో శిక్షణ అందించడంలో దోహదపడుతుందని చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని రోగుల సంరక్షణ ప్రమాణాలను పెంచడంలోనూ సానుకూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ఫుజి ఫిల్మ్ ఇండియా డివిజన్ హెడ్ ధీరజ్ చౌదరి మాట్లాడుతూ దేశంలో రోగుల సంరక్షణ ప్రమాణాల పెంపునకు వ్యూహాత్మక భాగస్వామ్యంతో పనిచేయనున్నట్టు తెలిపారు.