
పెద్దపల్లి, జూలై 1(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లింక్-1,2లో గోదారమ్మ పరుగులు తీస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్‌హౌస్‌లో 8 పంపుల ద్వారా నీటిని సరస్వతి బరాజ్‌కు తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సరస్వతి పంప్‌హౌస్‌లో 5 మోటర్ల ద్వారా పార్వతి బరాజ్‌కు.. పార్వతి పంప్‌హౌస్‌లో ఆరు మోటర్ల ద్వారా నీటిని ఎల్లంపల్లి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. లింక్-2లో నంది పంప్‌హౌస్‌లోని 6 మోటర్ల ద్వారా నీటిని కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఆరు బాహుబలి మోటర్ల ద్వారా ఎత్తిపోస్తుండగా, గ్రావిటీ కాలువ ద్వారా వెళ్తున్న నీరు వరద కాలువలో శ్రీరాములపల్లి జంక్షన్ పాయింట్ వద్ద ఓ వైపు ఎస్సారార్ జలాశయం, మరోవైపు రివర్స్ పంపింగ్ కోసం మల్యాలవైపు తరలివెళ్తున్నది.