జనగామ, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీలు, 420 హామీలను గాలికి వదిలిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల సొమ్మును కొల్లగొట్టి తన కుటుంబసభ్యులకు ఆస్తులు కూడపెడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. బుధవారం జనగామలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు రాకేశ్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీని అశోక్‌నగర్ తీసుకొచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ రాష్ట్రంలో నిరుద్యోగుల పొట్టకొడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వందలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్న సీఎం రేవంత్ తన కూతురు పేరిట ఇంటర్నేషనల్ సూళ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌పై రాష్ట్రంలోని నిరుద్యోగ, యువత ఆగ్రహంతో రగిలిపోతున్నారని.. ఎన్నికలు జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం గ్రామ గ్రామాన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలని, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ఎద్దేవాచేశారు. రూ.4 వేల నిరుద్యోగ భృతి, స్కూటీల పంపిణీ హామీ, పీఆర్సీ, టీఏ, డీఏలపై సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 12 వేల ఉద్యోగాలే ఇచ్చిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. మెగా డీఎస్సీ పేరుతో పాత నోటిఫికేషన్ మార్చివేసి నిరుద్యోగులను వంచించిందని ధ్వజమెత్తారు. పోలీస్‌శాఖలో 60 వేల ఉద్యోగాలు, విద్యుత్తుశాఖలో 20 వేలకు పైగా ఉద్యోగులను పర్మినెంట్ చేసింది, సింగరేణిలో 14 వేల మందికి ఉద్యోగాలు, ఆర్టీసీలో 15 వేల మంది, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను భర్తీ చేసింది బీఆర్ఎస్ హయాంలోనేనని గుర్తుచేశారు. మూడేండ్లుగా రాష్ర్టంలోని విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ జరగలేదని, కాకతీయ యూనివర్సిటీ నోటిఫికేషన్లో 46 పోస్టుల భర్తీకే అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.వెయ్యి కోట్ల నిధులు ఎకడ? అని ప్రశ్నించారు. వచ్చే రెండు నెలల్లో ప్రజలపై రూ.5,200 కోట్ల విద్యుత్తు చార్జీల భారం పడబోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.