హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కొత్త ప్రభుత్వమని ఇన్నాళ్లు ఓపికపట్టామని, ఇక తమకు ఓపిక లేదని రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలిచ్చినా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సన్నాహక సమావేశాన్ని మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించారు. రాష్ట్రంలోని 34 సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో 104 సంఘాలుండగా, త్వరలో వారికి జేఏసీలో సభ్యత్వం కల్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ మాట్లాడుతూ గతంలో రెండు డీఏలు పెండింగ్‌లో ఉంటేనే ధర్నాలకు దిగిన సందర్భాలున్నాయని, ఇప్పుడు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, జూలై వస్తే ఐదో డీఏ ప్రభుత్వం బాకీపడుతుందని చెప్పారు.
కొత్త ప్రభుత్వమని ఓపికపట్టాం: ఏలూరి
రాష్ట్రంలోని ఉద్యోగులు అనేక సమస్యల్లో ఉన్నారని, 150 సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇంత కాలం కొత్త ప్రభుత్వమని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఓపికపట్టామని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. తాము ఓపికపట్టినా కిందిస్థాయి అధికారులు, ప్రాథమిక సభ్యులు తమ తక్షణమే సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని, ఉద్యోగులను నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందని చెప్పారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జేఏసీగా ఏర్పడ్డామని, ప్రస్తుతం 34 సంఘాలతో ఉన్నా మిగిలిన అన్ని సంఘాలను కలుపుకుని పోరాటాలకు సిద్ధమని ప్రకటించారు. ఒకటో తారీకున జీతం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, సీఎం, మంత్రులు ఓ రెండు గంటలు సమయం కేటాయిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
దివ్యదేవరాజన్, చిన్నారెడ్డి, కోదండరాంతో కమిటీ వేసినట్టు పేపర్లల్లో మాత్రమే కనిపించిందని, అధికారులను కలిస్తే ఉత్తర్వులే ఇవ్వలేదన్నారని వాపోయారు. టీచర్ల తరహాలోనే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని, 17 శాతం డీఏ పెండింగ్‌లో ఉందని, కనీసం రెండు డీఏలను ఇవ్వాలని, ఉద్యోగుల చందాతో ఈహెచ్ఎస్లు అమలుచేయాలని, సీపీఎస్‌పై కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఎండీ ముజీబ్ హుస్సేనీ, ఏనుగుల సత్యనారాయణ, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి (ఇంటర్ విద్యా జేఏసీ), వంగ రవీందర్‌రెడ్డి, కే గౌతమ్‌కుమార్ (ట్రెసా), మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ (గ్రూప్ 1 అధికారుల సంఘం), లచ్చిరెడ్డి, కే రామకృష్ణ (డిప్యూటీ కలెక్టర్ల అసొసియేషన్), మణిపాల్‌రెడ్డి (టీటీయూ), జ్ఞానేశ్వర్ (నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం) తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు