హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆగస్టు 7, 8న నిర్వహించనున్న గ్రూప్-2 పోస్టుల రాత పరీక్షల కోసం ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ‘ఎడిట్ ఆప్షన్’ అవకాశం కల్పించామని శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. పేర్లు, జెండర్, పుట్టిన తేదీ, కమ్యూనిటీ, నాన్-క్రిమీలేయర్ స్టేటస్, పీడబ్ల్యూడీ క్యాటగిరీ, డిసేబులిటీ పర్సంటేజ్, స్ర్కైబ్/కంపెన్సేటరీ టైమ్, లోకల్ స్టేటస్, స్పోర్ట్స్ వంటి వివరాల్లో సవరణలు చేయాలనుకున్న అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఎడిట్ ఆప్షన్ కోసం ఈ నెల 16 నుంచి 20వరకు గడువు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత.. దానిని పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుని, మరోసారి జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.