ముసుగు మరోసారి తొలగిపోయింది. చీకటిబంధం గుట్టు మళ్లీ రట్టయ్యింది. బయటకు చెప్పకపోయినా రేవంత్-బీజేపీ దోస్తానా పదే పదే బయటపడుతూనే ఉన్నది. కేటీఆర్‌పై ఆగమేఘాల మీద ఈడీ కేసు నమోదు కావడం వెనుక కూడా ఏ ‘ఫార్ములా’ పనిచేసిందో బహిరంగ రహస్యమే!
సివిల్ సప్లయ్‌లో స్కాం జరిగిందని ఈడీ, సీబీఐ, కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. ఆరునెలలుగా విచారణే లేదు! మంత్రి పొంగులేటి ఇంటిపై దాడులు జరిపి 80 రోజులు దాటినా.. నేటికీ ఈడీ స్పందించలేదు. ఏం దొరికిందో చెప్పలేదు! సీఎం బామ్మర్ది కంపెనీ ద్వారా అమృత్ స్కీంలో స్కాం జరిగిందని ఢిల్లీకి వెళ్లి మరీ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినా.. ఈడీ అటువైపే చూడలేదు! అనుచిత లబ్ధిపై ఫిర్యాదులెన్ని వచ్చినా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగనేలేదు!
ఈ-రేసింగ్‌లో అవినీతే జరగలేదని నిపుణులు చెప్తున్నమాట. ఇందులో అవినీతేమీ లేదని సాక్షాత్తు మంత్రి పొన్నమే చెప్తున్నారు. అయినా వ్యక్తిగత దుగ్ధ! రాజకీయ కక్ష! కేసుపెట్టి వేధించాలనుకున్న రేవంత్‌కు ఢిల్లీ కూడా అనుమతించినట్టే ఉన్నది. ఈ-రేసింగ్ జరిగిన 14 నెలల తర్వాత ప్రభుత్వం దర్యాప్తునకు సిద్ధమైంది. ఫిర్యాదు అందిన గంటల్లోనే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో ఏమున్నదో కూడా తెల్వకముందే, కోర్టులో విచారణ జరుగు తుండగానే ఈడీ సూపర్‌ఫాస్ట్‌గా కేసు నమోదు చేసింది. ఈ కథాక్రమం చూస్తే కాంగ్రెస్-బీజేపీ రాజకీయ రచన అర్థమవుతూనే ఉన్నది.
KTR | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేసులో జరిగిన చెల్లింపుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతోపాటు మరికొందరిపై కేసు నమోదుచేసింది. కేటీఆర్‌పై నమోదుచేసిన ఎఫ్ఐఆర్, ఇతర డాక్యుమెంట్లు ఇవ్వాలని హైదరాబాద్ ఈడీ అధికారులు ఏసీబీ డీజీకి లేఖ రాశారు. కేటీఆర్‌పై తెలంగాణ ఏసీబీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను పరిగణనలోకి తీసుకొన్న ఈడీ హవాలా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ‘ది ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసింది. ఏసీబీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్లోని నిందితుల వరుస క్రమాన్నే ఈడీ కూడా తన కేసులో నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్ ఉండగా, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా రిటైర్డ్ అధికారి బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఈసీఐఆర్ ఆధారంగా మొదట హవాలా చట్టం కింద కేసు దర్యాప్తు ప్రారంభిస్తామని ఈడీ అధికారులు తెలిపారు.
దీంతోపాటు ‘ఫారెన్ ఎక్సేంజ్ మేనెజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయో అన్వేషిస్తామని వెల్లడించారు. ఈ కేసులో విదేశీ కంపెనీకి నిధులు వెళ్లడంతో.. ఫెమా యాక్ట్ వర్తింపుపైనే ఈడీ దృష్టిపెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో ఏసీబీ డీజీ విజయ్‌కుమార్‌కు ఈడీ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ లేఖ రాశారు. నిరుడు ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన రేస్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై మాజీ మంత్రి కేటీఆర్, ఇతరులపై గురువారం ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏసీబీ కేసులతో రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలోకి.. ఈడీ కూడా ప్రవేశించడంతో సర్వత్రా ఉతంఠ నెలకొంది. గురువారమే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. శుక్రవారమే ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేయడం అనుమానాలకు దారి తీస్తున్నది.
చీకటి దోస్తానా బట్టబయలు
కాంగ్రెస్- బీజేపీ చీకటి దోస్తానా మరోసారి బట్టబయలైంది. ఈ రెండు పార్టీలు చీకట్లో షేక్హాండ్లిచ్చుకుని పచ్చిగా సహకరించుకుంటున్న వైనం కళ్లకు కడుతున్నది. కేటీఆర్ మీద ఈడీ కేసు దాన్నే ధ్రువపరుస్తున్నది. అపుడెపుడో హుజూరాబాద్ ఎన్నికల్లో నామ్‌కే వాస్తే అభ్యర్థిని నిలపడం నుంచి మొదలైన బీజేపీ -కాంగ్రెస్ చీకటి సంసారం అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పర సహకారం, పార్లమెంటు ఎన్నికల్లో సగం సగం సీట్ల సర్దుబాటుతో పరాకాష్ఠకు చేరింది. జాతీయ స్థాయిలో మోదీ- రాహుల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. పార్లమెంటు ఆవరణలో రెండుపార్టీలు పరస్పరం భౌతికదాడులకు దిగుతున్నాయి. మరి రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కారు మీద బీజేపీ వైఖరి ఎలా ఉండాలి? బెంగాల్లో ఎలా ఉంది? కర్ణాటకలో ఎలా ఉంది? అక్కడ వీధుల్లో విధ్వంసాలు సష్టిస్తున్న బీజేపీ తెలంగాణలో రేవంత్ సర్కారు మీద ఎందుకు మౌనం పాటిస్తున్నది? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచింది. గత ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం మీద బీజేపీ ఏ ఒక్క అంశంలోనైనా పోరాడిందా? ఆరు గ్యారెంటీల అమలుకు బీజేపీ ఏనాడన్నా డిమాండ్ చేసిందా? కేసీఆర్ హయాంలో రెచ్చిపోయిన సర్జికల్ స్ట్రైకు వీరులు ఏమైపోయారు? అప్పటి వీధి పోరాటాలేమయ్యాయి? గురుకులాల్లో పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా.. పట్టించుకోరు. ఆటోడ్రైవర్లు ఆత్మహత్యల బాట పడుతున్నారు.
కన్నెత్తి కూడా చూడరు. చేనేతన్నలు ఉరికంబాలకు వేలాడుతున్నారు. ఆ వైపుకే వెళ్లరు. దవాఖానల్లో మందులు లేవు. విద్యార్థులకు రీఇంబర్స్మెంటు లేదు. యువతకు ఉద్యోగ క్యాలెండరూ లేదు. రైతుబంధు అతీగతీ లేదు. రుణమాఫీ గుణకారాలు బాగాహారాల్లో గణాంకాల గందరగోళమైంది. ధాన్యం కొనేవారు లేక ఇతర రాష్ర్టాలకు తరలిపోతున్నది. రియల్ ఎస్టేట్ పాతాళానికి జారిపోయింది. హైదరాబాద్ ప్రతిష్ట అధోగతి పాలైంది. అయినా సరే.. ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడడు. టీవీలో హరికథలు చెప్పే లఘువులు మౌనవ్రతం దాల్చారు. దొంగలు పడ్డ ఆర్నెల్లకు.. అన్న చందంగా అంతా కూల్చేశాక.. మూసీ నిద్రల నాటకాలు ఆడతారు తప్ప మళ్లీ ఆ వైపు వెళ్లరు. లగచర్ల ఉదంతంలో రైతులు జైలు పాలైనా పట్టించుకోరు. ఏతావాతా గత 12 నెలల రాష్ట్ర బీజేపీ రాజకీయ ప్రోగ్రెస్ కార్డు రిపోర్ట్ ఏమిటంటే సున్నా బై సున్నా! బీఆర్ఎస్ హయాంలో కేంద్రంనుంచి వారానికో నాయకుడు పర్యటించి ప్రభుత్వం మీద బురద చల్లేవారు. ఇప్పుడు ఒక్క నాయకుడూ ఇటువైపు రావడం లేదు? ప్రభుత్వాన్ని కడిగేయడం లేదు? కాంగ్రెస్ మీద పోరాడకుండా బీజేపీని ఏ శక్తి ఆపుతున్నది? ఆ శక్తికి ఒనగూరుతున్న ప్రయోజనాలు ఏమిటి? బీజేపీ మౌనం వెనుక మతలబు ఏమిటి?
కేటీఆర్‌కు త్వరలో నోటీసులు..
ఫార్ములా ఈ-కార్ రేస్‌పై ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు.. కేటీఆర్‌ను విచారించేందుకు త్వరలోనే నోటీసులు ఇస్తారని సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించిన ఈడీ అధికారులు.. అందుకు సంబంధించిన ప్రశ్నలను కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే, తమ విచారణలో మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపైనే దృష్టి పెట్టిన ఈడీ అధికారులు వివరాలు రాబట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కాగా, మంత్రి హోదాలో తానే డబ్బులు ఇవ్వమని చెప్పినట్టు కేటీఆర్ అంటుండగా.. డబ్బులు ముట్టినట్టు నిర్వహణ కంపెనీ వెల్లడించిన నేపథ్యంలో ఎక్కడ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.