హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): బ్రైట్ కామ్ గ్రూప్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థల్లో ఈడీ దాడులు మరోసారి కలకలం రేపాయి. ఫారిన్ ఎక్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఈ నెల 23న కంపెనీలో నిర్వహించిన సోదాల్లో రూ.3.3 కోట్ల నగదుతోపాటు రూ.9.3 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. కంపెనీ సీఈవో, సీఎఫ్‌వో, ఆడిటర్ ఇల్లు, కార్యాలయాల్లో శనివారం ఐదుచోట్ల సోదాలు నిర్వహించినట్టు వెల్లడించింది. ఆడిటర్ మురళీమోహన్ ఇంట్లో నగదు, బంగారం, సీఈవో సురేశ్‌కుమార్‌రెడ్డి, సీఎఫ్‌వో రాజు ఇండ్లల్లో కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.
సంస్థ షేర్లను విక్రయించి దాదాపు రూ.868 కోట్లు సమీకరించినట్టు గుర్తించినట్టు చెప్పారు. కంపెనీ ఖాతాలో జమైన నగదును ఇతర డొల్ల కంపెనీలకు మళ్లించినట్టు దర్యాప్తులో తేలిందని తెలిపారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్టు గుర్తించామని వెల్లడించారు. బీజీఎల్‌పై సెబీకి ఫిర్యాదులు రావడంతో లావాదేవీలపై ఇప్పటికే ఆంక్షలు విధించారు. బ్యాంకు ఖాతా వివరాలను ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. సెబీ దర్యాప్తు ఆధారంగా ఈడీ అధికారులు ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఎండీ సురేశ్‌కుమార్‌రెడ్డి, సీఎఫ్‌వో నారాయణ్ రాజుకు యాజమాన్య హోదాపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సెబీ నిషేధం విధించింది. సెక్యూరిటీల మారెట్ నుంచి కూడా సురేశ్ కుమార్‌రెడ్డిని నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. కంపెనీ ఆడిటర్లు, అసోసియేట్లతోపాటు వాటి పూర్వ, ప్రస్తుత భాగస్వాములు ఎవరూ బీజీఎల్, దాని అనుబంధ సంస్థలతో ఏ హోదాలోనూ కార్యకలాపాలు కొనసాగించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.