హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర లేచింది. హైకోర్టు ఆవరణలో ఈ-సేవ కేంద్రం ఏర్పాటైంది. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే శనివారం ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటైన ఫైలింగ్ సెక్షన్ను ఆనుకొని ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కేసులు ఏ స్థాయి లో ఉన్నాయో ఈ కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చు. కోర్టు ఉత్తర్వుల సాఫ్ట్ కాపీలను వా ట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పొందవచ్చు. ఈ-కోర్టుల మొబైల్ యాప్ డౌన్లోడింగ్, జడ్జీల సెలవులు, ఆర్డర్ల సర్టిఫైడ్ కాపీలు, పిటిషన్లు, కౌంటర్ల ఈ-ఫైలింగ్, ఈ-సంతకాలు పొంది, వాటిని అప్లోడ్ కూడా చేయవచ్చు. న్యాయసేవాధికార సంస్థ ల నుంచి ఉచిత న్యాయసేవలు పొందేందుకు కూడా వీలుంది. అందరికీ అందుబాటులో న్యాయం ఉండాలన్న రాజ్యాంగ లక్ష్యాన్ని నెరవేర్చాలని సుప్రీంకోర్టు ఈ-కమిటీ నిర్ణయించిన మేరకు హైకోర్టులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.