హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): కుటుంబసభ్యుల మధ్య తలెత్తే వివాదాల పరిషారంలో పోలీసులు వారి తల్లిదండ్రుల మాదిరిగా వ్యవహరించాలని రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ శిఖాగోయల్ అన్నారు. దంపతులు, అన్నదమ్ముళ్ల మధ్య చిన్న అపార్థాలతో వివాదాలు మొదలవుతుంటాయని, వాటిని పోలీసులు కుటుంబసభ్యుల తరహాలోనే పరిషరించాలని చెప్పారు. ‘మధ్యవర్తిత్వం-చైతన్యం’ అనే అంశంపై రాష్ట్ర పోలీసులు అధికారులకు హైదరాబాద్ ఐఏఎంసీలో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శిఖా గోయల్ ప్రసంగించారు.
కేసు నమోదు చేయడం విధి నిర్వహణలో భాగమని, వాటిలో రాజీ చేయతగ్గవి ఏమిటో గుర్తించి ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఐఏఎంసీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేసులను ఉభయపక్షాలు మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిఖ్ ఖాన్ చెప్పారు. ఢిల్లీ హైకోర్టు మీడియేషన్ కేంద్రం సంధాన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీణ, మధ్యవర్తిత్వ నిపుణురాలు పూర్ణిమా కాంబ్లే, చిత్రా నారాయణ్, ఏక్తా బల్లు, సీనియర్ న్యాయవాది విక్రం పూసర్ల తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో 80 మంది పోలీసు అధికారులు, న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.