ములుగు, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ (దాదా) అలియాస్ చొక్కారావు మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరుతో దామోదర్ మృతి చెందినట్టు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పోలీసుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆదివారం మావోయిస్టుల ప్రకటన బోగస్ అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. మూడు అంచెల భద్రత కలిగిన మావోయిస్టు అగ్రనేత దామోదర్ దళానికి చెందిన వారు చనిపోవడంతో ఆయన సైతం మృతిచెంది ఉంటాడనే కోణంలో ప్రకటన వెలువడి ఉంటుందని భావిస్తున్నారు. ఆయన మృతదేహంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం కూడా ఆయన బతికి ఉన్నాడా? లేక చనిపోయా డా? అనే అనుమానాలు ములుగు జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చొక్కారావు చనిపోలే!
ఈ నెల 16న ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెంది న 12 మందిలో దామోదర్ మృతదేహం లేదని, ఆయన చనిపోలేదని తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్ తల్లి బతుకమ్మతోపాటు బంధువులు, గ్రామస్థులు చెప్తున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగిందని వారు గుర్తుచేశారు. చొక్కారావు మృతి చెందాడనే విషయాన్ని తాము నమ్మడం లేదని పేర్కొన్నారు. ఆయన మృతదేహాన్ని చూస్తే తప్ప తాము ఒక నిర్ణయానికి రాలేమని అంటున్నారు.