హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలను విద్యాశాఖ ఆధ్వర్యంలోని పీఎంశ్రీ ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపొద్దని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ అంగన్వాడీ టీచర్లకు తెలిపారు. అంగన్వాడీ పిల్లలను తమ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు పంపాలంటూ ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒత్తిడి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఎవరి బెదిరింపులకు భయపడొద్దని స్పష్టంచేశారు. ‘పీఎంశ్రీ’లకు అంగన్వాడీ టీచర్లను పంపండి’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణలో సోమవారం ప్రచురితమైన వార్తకు కాంతి వెస్లీ స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అంగన్వాడీలు ఫిర్యాదు చేసిన తర్వాత ప్రకటించారు. అంగన్వాడీ పిల్లలను పీఎంశ్రీలకు తరలించాలంటూ హెడ్మాస్టర్లు తమను ఒత్తిడి చేస్తున్నారంటూ స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదు చేశారు. అంగన్వాడీ పిల్లలను ఎక్కడికీ పంపేదిలేదని మంత్రి స్పష్టంచేశారు.