హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్యను 13 నుంచి 5కు తగ్గించడం సరికాదని హైకోర్టు పేర్కొన్నది. నిర్వహణ కోసం తాతాలిక కౌన్సిల్ ఏర్పాటు చట్ట వ్యతిరేకమని తెలిపింది. ఎన్నికలు నిర్వహించే వరకు తాతాలిక కౌన్సిల్‌ను కొనసాగించవచ్చని చెప్పింది. గతంలోలాగే 13 మంది కౌన్సిల్ సభ్యులు ఉండాలని, 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సీజే ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. కౌన్సిల్‌కు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను 13 నుంచి 5కు తగ్గిస్తూ 2015 ఆగస్టు 3న జీవో 68, తాతాలిక కౌన్సిల్ ఏర్పాటుకోసం 2016 జనవరి 6న మరో జీవోను ప్రభుత్వం జారీచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టంలో ఏపీ అని ఉన్న చోట తెలంగాణ అనే పదం చేర్చే క్రమంలో చట్టంలోనే మార్పులు తేవడం సరికాదని స్పష్టం చేసింది. ఆ రెండు జీవోలను హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల తీర్పు వెలువరించింది.