హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : జేఈఈ పరీక్షల్లో ఈ ఏడాది కొత్తగా డిజిలాకర్ రిజిస్ట్రేషన్‌ను ప్రవేశపెట్టారు. పరీక్షకు హాజరయ్యే వారు డిజిలాకర్/అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని ఎన్టీఏ సూచించింది. అయితే ఈ ఐడీ లేని వారు నాన్ ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉం టుంది. ఇలాంటి వారు కనీసం గంట ముందుగా పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఏ పేర్కొన్నది. ఇది వరకు జేఈఈ మెయిన్స్‌లో ఛాయిస్ ప్రశ్నలుండేవి. సెక్షన్-బీలో 10 ప్రశ్నలిస్తే విద్యార్థులు 5ప్రశ్నలు రాసే అవకాశముండేది. కానిప్పుడు ఈ ఛాయిస్‌ను తొలగించారు. దీంతో సెక్షన్-బీలో ఇచ్చిన 5 ప్రశ్నలకు ఐదు రాయాల్సిందే. దీంతో 300కు మాడు వందల మార్కులు రావడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేఈఈ మెయిన్స్-1 ప్రవేశ పరీక్షలు 22న ప్రారంభమై 30న ముగియనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు. బీఈ/బీటెక్‌తోపాటు బీఆర్క్, బీప్లానింగ్ పేపర్లకు సైతం పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్-1కు 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెం, హైదరాబాద్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలు ; 24న ప్రాథమిక ‘కీ’ విడుదల
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలు ఈ నెల 2న ప్రారంభమై సోమవారంతో ముగిశాయి. 24న ప్రాథమిక ‘కీ’ విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. పేపర్-1కు 94,327 మంది అభ్యర్థులకు 69,476 (73.65%) మంది హాజరయ్యారు. ఇక పేపర్-2 గణితం, సైన్స్‌కు 93,263 మందికి 69,390(74.40%) మంది, సోషల్‌కు 88,163 మందికి 66,412(74,33%) మంది అభ్యర్థులు హాజరైనట్టు తెలిపారు. మొత్తంగా మూడు పేపర్లకు 2,75,753 మందికి 2,05,278 మంది(74.44%) హాజరైనట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 5న టెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తారు.