గురువారం 09 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 01:39:21

నకిలీ విత్తన ముఠాల భరతం పట్టండి

నకిలీ విత్తన ముఠాల భరతం పట్టండి

  • పోలీసు, వ్యవసాయశాఖలకు డీజీపీ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నకిలీ విత్తనాలు అమ్మాలంటేనే ముఠాలు వణికిపోయేలా చర్యలు తీసుకోవాలని పోలీసు, వ్యవసాయశాఖలను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డీజీపీ గురువారం వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డితో కలిసి పోలీసు సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నకిలీ విత్తన ముఠాలను తరిమికొట్టేందుకు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సూచించారు. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, ముఠాలపై గట్టి నిఘా పెట్టాలని చెప్పారు.

గతంలో నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడ్డవారిపైనా దృష్టి సారించాలని తెలిపారు. నాసిరకం విత్తనాలు, నకిలీ లైసెన్సులతో, తప్పుడు లేబులింగ్‌లతో విత్తనాలు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని ఆదేశించారు. కేసుల నమోదు నివేదికలను ప్రతి రోజు డీజీపీ కార్యాలయానికి పంపాలని, తాను వ్యక్తిగతంగా మానిటర్‌ చేస్తానని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మిన 13 మందిపై ఇప్పటికే పీడీయాక్టులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. కాగా, నకిలీ విత్తనాలు ఏ విధంగా గుర్తించాలి. విత్తన చట్టాలు ఏంటి అన్న అంశాలపై వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించారు. 


logo