శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 11:44:22

ప్రణాళికబద్దంగా గ్రామాల అభివృద్ధి : సీఎం కేసీఆర్‌

ప్రణాళికబద్దంగా గ్రామాల అభివృద్ధి : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామాలను ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 8 వేల 690 గ్రామ పంచాయతీలు ఉంటే వాటి సంఖ్యను 12,751కు పెంచినట్లు తెలిపారు. తండాల్లో గిరిజనులే పాలకులుగా ఉన్నారన్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలను మారుస్తున్నామన్నారు. ప్రతీ గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. వందశాతం వైకుంఠధామాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. 

పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం స్టాండింగ్‌ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిదులపై చర్యలు తప్పవన్నారు. గ్రామాలన్నీ పచ్చదనంతో వెల్లువిరిసేలా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 2020-21 ఏడాదిలో 23 కోట్లకుపైగా మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. పల్లెప్రగతి పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులను నియమించినట్లు వెల్లడించారు. 45 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు.


logo