వనపర్తి : అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయంటే కారణం కొత్త జిల్లాల ఏర్పాటు వల్లే సాధ్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు చేరువైందన్నారు. ప్రజల డిమాండ్, ఆకాంక్షల మేరకు 33 జిల్లాల ఏర్పాటు చేశామన్నారు.
చిన్న జిల్లాలతో కలెక్టర్లకు సంపూర్ణ అవగాహన ఏర్పడటంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించివేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు, అమరుల ఆకాంక్షల మేరకు ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు.
వనపర్తిలో జరుగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. అలాగే మూడు రోజులు కేసీఆర్ మహిళాబంధు సంబురాలను కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.