హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): ఆ విద్యార్థి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో బ్రాంజ్ మెడల్, ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్, కామన్వెల్త్లో గోల్డ్‌మెడల్ సాధించాడు. చదువుల్లోనూ ప్రతిభావంతుడైన ఆ విద్యార్థి ఎప్‌సెట్‌లో టాప్ ర్యాం క్ కాలేజీల్లో సీటు వస్తుందని ఆశపడ్డాడు. కానీ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తప్పిదంతో అనామక కాలేజీల్లో సీటు పొందాల్సి వస్తుం ది. నిజామాబాద్ జిల్లా రెంజల్‌కు చెందిన శ్రీశ్వాన్ మరలాక్షరి 2019లో అండర్-14 ఏషియన్ ఇంటర్నేషనల్ యూత్ చెస్ పోటీ ల్లో గోల్డ్ మెడల్, అదే ఏడాది వరల్డ్ చెస్ చాం పియన్షిప్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్‌ల్లోనూ పతకాలు కొ ల్లగొట్టాడు. ఇంటర్ పూర్తి చేసిన శ్రీశ్వాన్ ఎంసెట్‌లో 15,784 ర్యాంకు సాధించాడు. స్పోర్ట్స్ కోటా కింద టాప్ కాలేజీల్లో సీటు వస్తుందనే నమ్మకంతో జూలై 6న కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. కానీ సాంకేతిక విద్యామండలి అధికారులు స్పోర్ట్స్ కోటా వర్తించదని తేల్చిచెప్పారు. దీంతో స్పోర్స్ అథారిటీ అధికారులను సంప్రదించగా, వారు కూడా అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
దీంతో కోర్టును ఆశ్రయించగా, శ్రీశ్వాన్‌కు స్పోర్ట్స్ కోటా కింద సీటు ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల కాఫీతో పలుమార్లు సాంకేతిక విద్యామండలి అధికారులను కలిశారు. అయితే టాప్ కాలేజీల్లో సీట్లు భర్తీ అయ్యాయని, వేరే కాలేజీల్లో సీటు ఇస్తామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఎస్జీఎఫ్ క్రీడల్లో రాణించిన విద్యార్థులకు స్పోర్ట్స్ కోటాలో టాప్ ర్యాంకు కాలేజీల్లో ప్రవేశం కల్పించాలని శ్రీశ్వాన్ పేర్కొంటున్నాడు. ప్రతి విషయంలో స్పోర్ట్స్ అధికారులు పొరపాటు చేసి తననెలా శిక్షిస్తారని ప్రశ్నిస్తున్నాడు. స్క్రీనింగ్ కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తనకు టాప్ కాలేజీల్లో సీటు రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. టాప్ కాలేజీల్లో సీట్లు అయిపోగా, స్పోర్ట్స్ కోటాలో 39 సీట్లు మిగలాయి. దీంతో ఆదిలాబాద్, సూర్యాపేటల్లోని కాలేజీల్లో సీట్లను తీసుకోమంటున్నారని, ఇదేం న్యాయమని ప్రశ్నిస్తున్నాడు. సాంకేతిక మండలి, స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుతో అన్యాయం జరిగిందని వాపోతున్నాడు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాడు.