Yashaswini Reddy | జనగామ చౌరస్తా, మార్చి 10 : పాలకుర్తి ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారిక క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న కాంగ్రెస్ రాజకీయ సమావేశాలపై వెంటనే విచారణ చేపట్టాలని సోమవారం జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ అసెంబ్లీ కార్యదర్శితో ఈ విషయంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలను ఎమ్మెల్యేలు దగ్గరుండి తెలుసుకోవడానికి, సమస్యలను పరిష్కరించడానికి, అధికారులతో సమీక్ష నిర్వహించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు అధికారిక క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేశారన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వినీరెడ్డితో పాటు ఆమె అత్త, ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి ఇటీవల అధికారిక క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ సమావేశాలు, చేరికలు రాజకీయాలకు సంబంధించిన మీడియా సమావేశాలు నిర్వహిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. భారత ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123 (7) ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం నిషేధిమని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార కార్యాలయంలో జరిగిన ఈ అక్రమ రాజకీయ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత ఎమ్మెల్యే యశస్వినీరెడ్డితో పాటు బాధ్యత వహించాల్సిన అధికారులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.