హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): గురుకుల నియామకాల్లో డౌన్ మెరిట్ విధానాన్ని అమలు చేయాలని 1:2 జాబితాలోని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మరోసారి ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించడంతోపాటు, నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ట్రిబ్ ద్వారా 9,210 పోస్టుల భర్తీని చేపట్టగా.. అందులో భారీగా పోస్టులు మిగిలిపోతున్నా యి. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ తదితర పోస్టులకు కామన్ పేపర్‌ను పెట్టడం, ఆ తర్వా త నియామకం సందర్భంగా అవరోహణ క్రమాన్ని పాటించకపోవడంతో దాదాపు 4 వేలకుపైగా పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పడిపోతున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యం లో డౌన్ మెరిట్ విధానాన్ని అమలు చేస్తే పోస్టులన్నీ భర్తీ కావడంతోపాటు మళ్లీ పరీక్షలను నిర్వహించాల్సిన అవసరం తప్పుతుందని, విద్యార్థులకు సైతం లబ్ధిచేకూరుతుందని చెప్తున్నారు. డౌన్మెరిట్ విధానానికి హైకోర్టు సైతం ఆమో దం తెలిపినప్పటికీ దాన్ని అమలు చేసేందుకు ట్రిబ్ నిరాకరిస్తున్నదని నిప్పులు చెరుగుతున్నారు.