హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బడంగ్‌పేట, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కంపెనీల పక్షాన ఉంటావా? రైతుల పక్షాన ఉంటావా? తేల్చుకోవాలని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి భూ దాహం తీరడం లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా భూముల కబ్జాల బాగోతమే నడుస్తున్నదని మండిపడ్డారు. నాదర్గుల్ భూముల కబ్జా విషయంలో ప్రభుత్వ పెద్దలు ఎంతకు బరితెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతులను అరిగోస పెడుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే జ్యుడీషియల్ కమిటీ వేసి రైతులకు నెల రోజుల్లోగా పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని విశారదన్ మహరాజ్ హెచ్చరించారు. ప్రతి గ్రామంలో భూముల సమస్య ఉన్నదని, ప్రతి మండలంలో వేల ఎకరాలు కొల్లగొడుతున్నారని ప్రభుత్వం నుంచి హామీ వచ్చేదాకా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కిరాయి సైన్యంతో భూములు తమ వశం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
అంతకుముందు రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన విశారదన్ మహరాజ్‌ను పోలీసులు మెయిన్ గేటు వద్దే నిలువరించారు. ఈ క్రమంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. రైతుల్ని పొలాల వద్ద ఎందుకు వెళ్లనివ్వడం లేదో చెప్పాలని మహరాజ్ ఆదిబట్ల ఇన్స్పెక్టర్ను నిలదీశారు. ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని ఇన్స్పెక్టర్ చెప్పడంతో మహరాజ్ సహా రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వ రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములపై కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా వత్తాసు పలుకుతారంటూ ఇన్స్పెక్టర్పై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టు ఉత్తర్వుల కాపీని చూపించాలని విశారదన్ మహరాజ్ నిలదీయంతో పోలీస్‌స్టేషన్‌కు వస్తే చూపిస్తాననటంతో వాగ్వాదం చోటుచేసుకున్నది. రౌడీలు, బౌన్సర్లకు పోలీసులు కాపలాగా ఉంటారా అని వారు నిలదీశారు. ప్రభుత్వ భూమి చుట్టూ శాశ్వతంగా గ్రానైట్ రాళ్లతో గోడ కట్టుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని పట్టుబట్టారు. జీహెచ్ఎంసీ నుంచి అనుమతి ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తుంటే పోలీసులు కబ్జాదారులకు కాపలా ఉంటారా అంటూ విశారదన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.