వచ్చే నాలుగేండ్లకు పశు సంవర్ధకశాఖ లక్ష్యాలు
75.70 లక్షల టన్నుల పాలు, 13.66 లక్షల టన్నుల మాంసం
2,152 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తికి నిర్ణయం
నాలుగేండ్లలో గణనీయంగా పెరిగిన ఉత్పత్తులు
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలు, మాంసం, కోడిగుడ్ల వినియోగం నానాటికీ పెరుగుతున్నది. దీంతో రానున్న నాలుగేండ్లలో వీటి ఉత్పత్తిని భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం సంవత్సరాలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 60.53 లక్షల టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తిని 2025-26 నాటికి 75.70 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించింది. అదేవిధంగా మాంసం ఉత్పత్తిని 9.94 లక్షల టన్నుల నుంచి 13.66 లక్షల టన్నులకు, కోడిగుడ్ల ఉత్పత్తిని 1,680 కోట్ల నుంచి 2,152 కోట్లకు పెంచేందుకు చర్యలు చేపడుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యల వల్ల తెలంగాణలో పశు సంపద గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం గొర్రెల పెంపకంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ.. పౌల్ట్రీ రంగంలో మూడో స్థానంలో నిలిచింది. పశుసంవర్ధకశాఖ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా గొర్రెల పంపిణీ, ఉచిత చేపల పంపిణీ, సబ్సిడీతో గేదెలను పంపిణీ చేయడంతోపాటు పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.4 ప్రోత్సహక పథకాన్ని చేపట్టింది. దీంతో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయ వృద్ధిని సాధించింది. 2014-15లో 42.07 లక్షల టన్నులుగా ఉన్న వార్షిక పాల ఉత్పత్తి సామర్థ్యం 2020-21 నాటికి 57.65 లక్షల టన్నులకు, మాంసం ఉత్పత్తి 5.05 లక్షల టన్నుల నుంచి 9.20 లక్షల టన్నులకు, కోడిగుడ్ల ఉత్పత్తి 1,061 కోట్ల నుంచి 1,586 కోట్లకు పెరిగింది.
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగానే..
రాష్ట్రంలో మాంసం, గుడ్లు, పాల వినియోగం భారీగా పెరుగుతున్నది. తదనుగుణంగా వాటి ఉత్పత్తిని భారీగా పెంచేందుకు ప్రణాళిక రూపొందించాం. రానున్న నాలుగేండ్ల అవసరాలను బేరీజు వేసుకొని ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకొన్నాం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ పథకాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో పాలు, చేపలు, మాంసం ఉత్పత్తి భారీగా పెరిగింది.