హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ప్లేస్మెంట్ సీజన్లో విద్యార్థులపై సహజంగా ఉండే ఒత్తిడి దృష్ట్యా భారీ వార్షిక వేతన ప్యాకేజీలను ఇకనుంచి బహిర్గతం చేయరాదని ఐఐటీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆల్ ఐఐటీస్ ప్లేస్మెంట్స్ కమిటీ (ఏఐపీసీ) సమావేశంలో ఐఐటీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దేశంలో 23 ఐఐటీల్లోని కెరీర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఐఐటీల్లో విద్యార్థులు పొందిన భారీ వేతన ప్యాకేజీలను వెల్లడించడం.. గొప్పగా ప్రచారం చేయడంపై ఇటీవలికాలంలో విమర్శలొస్తున్నాయి. ఇది సగటు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుందని వాదనలున్నాయి. కొంతమందికే భారీ వేతన ప్యాకేజీలు దక్కుతుండగా, సగటు వేతన ప్యాకేజీలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో తక్కువ ప్రతిభ విద్యార్థులు, సాధారణ విద్యార్థులు కుంగుబాటుకు గురవుతున్నారు. విద్యార్థుల్లో నిరాశ, నిస్పృహలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐపీసీ ఫిబ్రవరిలో మరోసారి సమావేశమై, తుది మార్గదర్శకాలను విడుదలచేసే అవకాశాలున్నాయి.