వికారాబాద్, జనవరి 28 : ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడిని పెండ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు ససేమిరా అనడంతో వారికి కన్న కూతురే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో చోటుచేసుకున్నది. ఈ నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథ్, లక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అశోక్ హైదరాబాద్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు.
కూతురు సురేఖ(25) బీఎస్సీ నర్సింగ్ చేసి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్నది. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయం కాగా.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయమై తల్లిదండ్రులకు చెప్పడంతో వారి పెండ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. తల్లిదండ్రులను ఎలాగైనా హత్య చేసి ప్రేమించిన అబ్బాయిని పెండ్లి చేసుకోవాలని పథకం రచించింది. ఎక్కువ డోస్ మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి చంపాలని భావించింది.
తాను పనిచేస్తున్న హాస్పిటల్లో మ త్తు ఇంజెక్షన్లు (అట్రాక్యురియం) అర్టాసిల్ 2.5 ఎంఎల్ ఇంజక్షన్లు నాలుగు బాటిళ్లను తస్కరించింది. పథకం ప్రకారం ఈనెల 24న సంగారెడ్డి నుంచి మోమిన్పేట్కు వెళ్లి మెడికల్ షాప్‌లో మూడు సిరంజీలను తీసుకొని యాచారానికి వచ్చింది. రాత్రి సమయంలో తల్లిదండ్రుల ముందు మరోసారి వారి ప్రేమ విషయాన్ని ప్రస్తావించగా వారు నిరాకరించారు. దీంతో మోకాళ్ల నొప్పులు తగ్గడానికి మందులు తీసుకొచ్చానని తల్లిదండ్రులను నమ్మించింది. వెంట తెచ్చుకున్న మత్తుమందును మోతాదుకు మించి ఇవ్వడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. తనకేమీ తెలియదు అన్నట్టుగా అన్న అశోక్‌కు ఫోన్‌చేసి.. ‘అమ్మానాన్నలు చనిపోయారు.
నాకు భయమేస్తుంది. తొందరగా రావాలి’ అంటూ విలపించింది. అశోక్ వచ్చి చూడగా తల్లిదండ్రుల మృతి పట్ల అనుమానం కలుగడంతో వెంటనే బంట్వారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా నాలుగు ఇంజెక్షన్ ఖాళీ బాటిళ్లు, వాడిన రెండు సిరంజీలు లభించాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. సురేఖపై అనుమానంతో విచారించారు. తల్లిదండ్రులను తానే చంపినట్టు అంగీకరించడంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో సీఐ రఘురాము, ఎస్సై విమల పాల్గొన్నారు.