హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : డాటా, ఏఐ రంగాలకు స్వర్ణయుగం రాబోతున్నదని, టైర్-2, 3 నగరాల్లోని ప్రతిభావంతులైన యువత వీటిలో అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్ ప్రైమియా భవనంలో కాన్‌స్టర్ సొల్యూషన్స్ కంపెనీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ కార్యకలాపాలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ లక్ష్యాలను కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు కేటీఆర్‌కు వివరించారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతున్నదని, ముఖ్యంగా డాటా, డాటా సెంటర్లు, సర్వర్లు, కృత్రిమ మేధస్సు(ఏఐ), కంటెంట్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఉజ్వల భవిష్యత్ ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమ రెండు రంగాల కోణాల నుంచి రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ ప్రపంచాన్ని అత్యంత దగ్గరగా చూసిన అనుభవంతో చెబుతున్నానని వివరించారు. తాను కూడా రెండు దశాబ్దాల క్రితం కార్పొరేట్ ప్రపంచంలో పనిచేశానని, అమెరికాలో విద్యాభ్యాసం చేసి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నదని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టైమ్‌జోన్లలో పనిచేస్తూ, అనేక దేశాల ఖాతాదారులతో కలిసి పనిచేయడం ఎంతటి సవాలో తనకు తెలుసని చెప్పారు.
కాన్‌స్టర్ పేరుపై సరదాగా స్పందించిన కేటీఆర్, సంస్థ పేరు వెనకున్న ‘కన్వర్జెన్స్ ఆఫ్ స్టోరేజ్’ అనే భావన తనకు ఆసక్తికరంగా అనిపించిందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ వినియోగం, ఉత్పత్తి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిల్వ చేయడం, నిర్వహించడం, ప్రపంచానికి చేరవేయడంలో కాన్‌స్టర్ సంస్థలకు కీలక పాత్ర ఉంటుందని చెప్పారు. నేటితరం సమాచారాన్ని పొందే విధానమే మారిపోయిందన్నారు. గతంలో వార్తాపత్రికలను పేజీపేజీగా చదివే రోజులుండేవని, ప్రస్తుత యువతరం మొబైల్ ఫోన్లో స్వైప్ చేస్తూ ప్రపంచాన్ని చూస్తున్నదని పేర్కొన్నారు. డిజిటల్ విప్లవంతో డేటా, స్టోరేజ్ రంగాల ప్రాధాన్యత మరింత పెరుగు తుందని చెప్పారు.
కేసీఆర్ పాలనలో ఐటీరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించామని కేటీఆర్ చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని టైర్-2 నగరాలకు విస్తరించే లక్ష్యంతో అనేక ఐటీ హబ్‌లు నిర్మించామని గుర్తుచేశారు. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కరీంనగర్ లాంటి నగరాల్లో స్థానికంగా ప్రతిభ కలిగిన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఐటీ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేసిందని కేటీఆర్ స్పష్టంచేశారు. ఒకప్పుడు కార్యాలయానికి వచ్చి, ఒకేచోట కలిసి పనిచేస్తే పనులు జరుగుతాయని భావించేవాళ్లమని, కొవిడ్ తర్వాత ఎక్కడి నుంచైనా పనిచేసి సమర్థవంతంగా ఫలితాలు సాధించవచ్చని నిరూపితమైందని పేర్కొన్నారు.
కాన్‌స్టర్ సొల్యూషన్స్ టైర్-2, టైర్-3 నగరాలపై ప్రత్యేక దృష్టిపెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత మారిన ప్రపంచంలో భౌగోళిక పరిమితులు పెద్ద అడ్డంకి కాదని, ప్రతిభ మాత్రమే ముఖ్యమని నొక్కిచెప్పారు. టైర్-2, 3 నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉన్న వారిలో దాగిన ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పిస్తే కంపెనీలు అద్భుతంగా పురోభివృద్ధి సాధిస్తాయని అభిప్రాయపడ్డారు. యువతను ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు తీసుకురావడం కంటే, కంపెనీలు వారి వద్దకే వెళ్లి అవకాశాలు కల్పించాలని సూచించారు. కాన్‌స్టర్ సొల్యూషన్స్ ఉద్యోగుల సంఖ్యను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం అభినందనీయమని చెప్పారు. కాన్‌స్టర్ సొల్యూషన్స్ సంస్థ వ్యవస్థాపకులు, నాయకత్వ బృందం, ఉద్యోగులందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.