సీఎం రేవంత్‌రెడ్డి అనుభవరాహిత్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్లో పడింది. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించింది. ద్రవ్య చలామణి పూర్తిగా స్తంభించింది. సామాన్యుల నుంచి వ్యాపారుల దాకా ప్రతి ఒక్కరికీ కాసుల కటకట నెలకొన్నది. దీన్ని ధ్రువీకరిస్తూ సెప్టెంబర్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డిఫ్లేషన్ దశలోకి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్‌లో ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్) -0.15%గా నమోదైనట్టు వివరించింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుభవరాహిత్యంతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ద్రవ్య చలామణి పూర్తిగా స్తంభించిపోయింది. సామాన్యుల నుంచి వ్యాపారుల దాకా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కాసుల కటకట మొదలైంది. మార్కెట్లో లక్ష రూపాయలు కూడా పుట్టని గడ్డు పరిస్థితులు దాపురించాయి.
దీన్ని ధ్రువపరుస్తూ.. సెప్టెంబర్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డిఫ్లేషన్ దశలోకి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది.
సెప్టెంబర్‌లో ప్రతి ద్రవ్యోల్బణం (డిప్లేషన్) 0.15%గా నమోదైనట్టు వివరించింది. ద్రవ్యోల్బణం నెగటివ్‌లోకి వెళ్లిన ఈ దుర్భర పరిస్థితిని కూడా ఓ విజయంగా ప్రచారం చేసుకోవాలనుకొన్న అధికార కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడింది. ఒకవేళ వరుస డిఫ్లేషన్ అనేది సానుకూల సంకేతమైతే, దేశంలో మరెక్కడా ఈ పరిస్థితి లేనేలేదు.
గడిచిన 11 ఏండ్లలో తెలంగాణలో ఎన్నడూ ఇది కనిపించలేదు. మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై సీఎం రేవంత్‌రెడ్డికి పట్టులేకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యమే రాష్ట్ర ఆర్థికం అతలాకుతలం కావడానికి, ప్రజల ఆర్థిక స్థితి రోజురోజుకూ దిగజారిపోవడానికి కారణమని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సెప్టెంబర్‌లో రాష్ట్ర ఆర్థికం మరోమారు ‘డిఫ్లేషన్’ (ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్రంలో మూడోసారి ప్రతి ద్రవ్యోల్బణం నమోదవ్వడం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్పీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. తెలంగాణలో సెప్టెంబర్‌లో ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్) 0.15% నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రతిద్రవ్యోల్బణం -0.29% ఉండగా.. పట్టణ ప్రాంతంలో -0.05% నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 1.54%. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏండ్ల తర్వాత గత జూన్‌లో తొలిసారిగా డిఫ్లేషన్ -0.93% నమోదైంది. ఆ మరుసటి నెల జూలైలోనూ డిఫ్లేషన్ -0.44% రికార్డయ్యింది. ఇప్పుడు సెప్టెంబర్‌లో మళ్లీ 0.15% నమోదైంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగుతున్నట్టు సూచించే ప్రమాదకర సంకేతమని, రాష్ట్రంలో కొవిడ్-19 మహమ్మారి కాలంనాటి దారుణ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింభిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థకు డేంజర్ బెల్
ఏ రాష్ర్టానికైనా డిఫ్లేషన్ అనేది ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు డేంజర్ బెల్ వంటిది. అందుకే ఆరోగ్యకరమైన ఆర్థిక వృద్ధి కోసం ద్రవ్యోల్బణ రేటు 2-6% మధ్య ఉండాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, తెలంగాణలో ద్రవ్యోల్బణం సున్నా కంటే తక్కువకు పడిపోయింది. ‘డిఫ్లేషన్ కారణంగా ప్రజల్లో కొనుగోలుశక్తి పడిపోయి వ్యాపారాలు దెబ్బతింటాయి. ఉద్యోగాలు ఊడిపోతాయి. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండదు. తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతున్నది’ అని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలేమిటీ డిఫ్లేషన్? ఎందుకు ఆందోళనకరం?
ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరలు సమయానుకూలంగా పెరుగడాన్ని ద్రవ్యోల్బణంగా చెప్తారు. ద్రవ్యోల్బణం అధికంగా పెరిగితే.. వస్తువులు, సేవల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఒక పరిధివరకూ తగ్గితే ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు. అయితే, అదే ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్తే అది డిఫ్లేషన్ స్టేట్లోకి జారినట్టు ఆర్థిక నిపుణులు చెప్తారు. నెగెటివ్ ద్రవ్యోల్బణం నమోదుచేసిన రాష్ట్రంలో ధరలు తగ్గడం అటుంచితే.. వస్తు, సేవలను వినియోగించుకొనే ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని అర్థం చేసుకోవాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రమాదకరం. ప్రస్తుతం సెప్టెంబర్‌లో తెలంగాణ ద్రవ్యోల్బణ రేటు మైనస్ 0.15 శాతానికి పడిపోయింది.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. కూరగాయలు, నూనె, నిత్యావసరాల ధరల్లో మార్పు లేదు. సూల్, కాలేజీ ఫీజులు కూడా ఏమాత్రం తగ్గలేదు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం నెగటివ్‌కు చేరిందంటే.. వీటిని కొనుగోలు చేసే పౌరుల ఆర్థికశక్తి తగ్గిపోయిందని అర్థం చేసుకోవాలి. అంటే ప్రజల ఖర్చు సామర్థ్యం క్షీణించినట్టే. వినోదం, టూరిజంపై ప్రజలు చేస్తున్న ఖర్చు తగ్గినట్టు అర్థం చేసుకోవాలి. ఇదే సమయంలో రియల్ఎస్టేట్ మారెట్ కుప్పకూలి.. వ్యాపార పెట్టుబడులు పూర్తిగా నిలిచిపోయాయని తెలుస్తున్నది. తద్వారా ఉపాధి అవకాశాలకు కూడా గండిపడినట్టే. ఇలాంటి కారణాల వల్లే సెప్టెంబర్‌లో మనదగ్గర డిఫ్లేషన్ నమోదైంది. ఇది కేవలం ద్రవ్యోల్బణ నియంత్రణ కాదు.. ఇది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంకేతమని, ఇది గణాంకాల్లో కనిపించే నెగటివ్ నంబర్ల కన్నా చాలా ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు ఏం జరుగొచ్చు?
ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డిఫ్లేషన్ స్టేట్లోకి వెళ్లిందంటే అది ఆ రాష్ట్ర ఆదాయంపై మరింత తీవ్రమైన ప్రభావం చూపించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో జీఎస్టీ వంటి పన్నుల వసూళ్లు మరింత గణనీయంగా తగ్గుతాయి. ఇది ప్రభుత్వ ఆదాయంపై ఒత్తిడిని పెంచుతుంది. రియల్ఎస్టేట్ రంగంలో క్షీణత వల్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వంటి ఆదాయ వనరులు కూడా దెబ్బతిన్నట్టే. వ్యాపార పెట్టుబడులు నిలిచిపోవడం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు లేక యువత నిరాశలో కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదైన డిఫ్లేషన్ రైతులను కూడా దెబ్బతీసినట్టే. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లేకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా చితికిపోతారు.
వ్యవసాయ రంగంలో డిమాండ్ తగ్గడం, ద్రవ్య చలామణి లేకపోవడంతో మారెట్లో అమ్మకాలు తగ్గడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడొచ్చు. ఈ పరిస్థితి రైతుల జీవనోపాధికి సవాల్‌గా మారుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు మూతపడే ప్రమాదాన్ని మరింత ఎదుర్కోవచ్చు. సేవారంగం మరింత గడ్డుపరిస్థితులను ఎదుర్కొనవచ్చు. వెరసి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ అనేదే ఉండదు. వస్తు, సేవల కొనుగోళ్లు తగ్గిపోతాయి. తద్వారా ఉత్పత్తి క్షీణించి పెట్టుబడులు నిలిచిపోతాయి. ఉపాధి అవకాశాలు మృగ్యమైపోతాయి. చేతిలో డబ్బులు లేక సామాన్యుల అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఆత్మహత్యలు పెరుగుతాయి.
పండగల వేళ తగ్గిన కొనుగోలు శక్తి
తెలంగాణలోనే అతి పెద్ద పండుగ అయిన బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా సెప్టెంబర్‌లో కొనుగోళ్లు పెరిగి ద్రవ్యోల్బణం ప్లస్‌లోకి రావాల్సి ఉండగా.. మరోసారి మైనస్‌లోకి వెళ్లడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఇది రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి అద్దంపడుతున్నది. పండగల కారణంగా కొనుగోలు శక్తి పెరిగి ప్రతిద్రవ్యోల్బణం కట్టడి అవుతుందని భావించినప్పటికీ సెప్టెంబర్‌లో డిఫ్లేషన్ -0.15% చేరుకోవడం పట్ల ఆర్థిక నిపుణలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సంక్షేమానికి సీఎం రేవంత్ రిక్త‘హస్తం’
రాష్ట్రంలో ఏర్పడిన ఈ సంక్షోభానికి సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే కారణమని నిపుణులు చెప్తున్నారు. సంక్షేమ రంగాన్ని గాలికొదిలేయడం ప్రధాన కారణంగా అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో ఆర్థిక భరోసా కల్పించే పథకాలకు సీఎం రేవంత్ చెల్లుచీటి ఇవ్వడంతోనే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని వివరిస్తున్నారు. రూ.4,000 ఆసరా పెన్షన్, మహాలక్ష్మి కింద మహిళలకు రూ.2,500, రైతుభరోసా రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000, విద్యా భరోసా కార్డు కింద రూ.5 లక్షలు, దళితబంధు కింద రూ.12 లక్షలు లాంటి హామీలను విస్మరించడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వివరిస్తున్నారు. ప్రజల చేతుల్లో డబ్బులు ఉండి ఉంటే కొనుగోలు శక్తి పెరిగేది. దీంతో ఆర్థిక లావాదేవీలు జరిగేవి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోనే ఈ దుస్థితి నెలకొన్నది.
రియల్ఎస్టేట్ ఢమాల్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన ‘హైడ్రా’ వంటివి రియల్ఎస్టేట్ రంగం కుదేలు కావడానికి కారణంగా నిలిచినట్టు నిపుణులు చెప్తున్నారు. దీంతో రియల్ఎస్టేట్, దాని అనుబంధంగా పనిచేసే నిర్మాణ, సేవా, బీమా రంగాల్లో కొత్త ఉద్యోగాలు మందగించాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన మూల ధన వ్యయాన్ని కూడా కుదించేసింది. ఇది సైతం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి కారణంగా మారింది. ఏ రాష్ర్టానికైనా ప్రతి ద్రవ్యోల్బణం (డీప్లేషన్) హెచ్చరిక లాంటింది. ప్రతిద్రవ్యోల్బణం కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి వ్యాపారాలు దెబ్బతింటాయి. ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉంటుంది. రాష్ర్టానికి కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితులున్నాయని నిపుణులు చెప్తున్నారు.
రేవంత్ ఆర్థిక అరాచకత్వం వల్లే..
కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నది. మూడు నెలలు ప్రతి ద్రవ్యోల్బణం రేవంత్ పాలనా వైఫల్యానికి నిదర్శనం. అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో రేవంత్ సరారు పూర్తిగా ఫెయిల్ అయింది. రాష్ట్రం తిరోగమనం వైపు పయనించడం ఆందోళనకరం. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చింది. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54శాతంగా నమోదైతే, తెలంగాణలో ప్రతి ద్రవ్యోల్బణం నమోదు అవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తున్నది.
జూన్‌లో -0.93%, జూలైలో -0.44%, సెప్టెంబర్‌లో -0.15% వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడుసార్లు నమోదుకావడం ఇదే మొదటిసారి. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సాధారణంగా వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం అయ్యే అవకాశం ఎకువగా ఉంటుంది. కానీ, నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక విధానాల ఫెయిల్యూర్. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని పాలనలో నానాటికి చతికిల పడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించాలి.
-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి
ఉమ్మడి ఏపీ కన్నా దారుణ పరిస్థితి
కాంగ్రెస్ పాలన కారణంగా ఉమ్మడి ఏపీ కన్నా దారుణ పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నాయి. కేసీఆర్ పాలనలో ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కాళేశ్వరం ప్రాజెక్టుతో సమృద్ధిగా నీళ్లు ఉండటంతో రైతాంగంలో కొనుగోలు శక్తి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం, ప్రజలు బాగుంటేనే పట్టణాల్లో కొనుగోళ్లు పెరుగుతాయి. ఒక నెల ప్రతి ద్రవ్యోల్బణం నమోదైందంటే యాక్సిడెంటల్ అనుకోవచ్చు. కానీ మూడు నెలలు ప్రతి ద్రవ్యోల్బణం నమోదు కావడం తెలంగాణలో రేవంత్ డ్యామేజీ పాలనకు నిదర్శనం. ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్లడం అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి ప్రతి ద్రవ్యోల్బణమే నిదర్శనం.
-డీ పాపారావు, ఆర్థిక రంగ నిపుణుడు
బీజేపీ రాష్ర్టాల్లోనూ అంతే
కాంగ్రెస్ పాలిత తెలంగాణలోనే కాదు బీజేపీపాలిత రాష్ర్టాల్లోనూ ప్రజల కొనుగోలు శక్తి అమాంతం పడిపోయింది. ఆయా రాష్ర్టాల్లో సెప్టెంబర్‌లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదవ్వడమే ఇందుకు రుజువు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆర్థిక ప్రగతి ఉరకలెత్తుతుందని ప్రధాని మోదీ సహా బీజేపీ సీనియర్లు వల్లె వేసే ప్రచారమంతా బూటకమని దీంతో రుజువైంది. ఇదిలాఉండగా.. ఆరోగ్యకరమైన ఆర్థిక వృద్ధి కోసం ద్రవ్యోల్బణ రేటు 2% నుంచి 6% మధ్య ఉండాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) లక్ష్యంగా పెట్టుకున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణలో ద్రవ్యోల్బణం దాదాపుగా ఆర్బీఐ లక్షిత బ్రాకెట్లోనే ఉండటం గమనార్హం. అందుకే, బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం, కొనుగోలు శక్తి, జీఎస్డీపీ వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది.
డిఫ్లేషన్‌తో ఏమౌతుంది? ఆర్థిక ఇబ్బందులతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం
తెలంగాణలో డిఫ్లేషన్‌కు కారణాలు
బీజేపీ పాలిత రాష్ర్టాల డిఫ్లేషన్
తెలంగాణలో 2025లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ), ద్రవ్యోల్బణ ట్రెండ్ ఇలా..
సెప్టెంబర్ -0.15%సెప్టెంబర్‌లో రాష్ట్ర ద్రవ్యోల్బణం ఇలా..