హైదరాబాద్: తెలంగాణలో ఆందోళనకర రీతిలో సిజేరియన్ ఆపరేషన్లు(C-Section Deliveries) జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అనేక ఆరోగ్య సూచీల్లో తెలంగాణ ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నా.. సీ సెక్షన్ ఆపరేషన్లు మాత్రం కలవరపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తెలంగాణలోనే ఎక్కువగా ఉననది. ఇక్కడ జరుగుతున్న పది డెలివరీల్లో.. ఆరుగురికి ఆపరేషన్ జరుగుతున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫలితాల ద్వారా వెల్లడైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆ గణాంకాలను రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 98.8 శాతం ప్రసూతీ కేసులు ఆస్పిటళ్లలోనే జరుగుతున్నాయని, ఇది జాతీయ సగటు 90.6 శాతం కన్నా ఎక్కువే అని, కానీ 62. 2 శాతం డెలివరీలు మాత్రం సిజేరియన్ సెక్షన్ ద్వారా జరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొన్నది. ఇది జాతీయ సగటు 27.2 శాతం కన్నా రెట్టింపు అని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ఎన్ఎఫ్హెచ్ఎస్-5 ఆరోగ్య సర్వే సమయంలో తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య 607 శాతంగా ఉంది. 2019 నుంచి 2021 మధ్య కాలంలో ఆ సర్వే జరిగింది. అయితే గత సర్వేకు.. తాజా సర్వేతో పోలిస్తే, కేవలం తెలంగాణలో మాత్రమే సిజేరియన్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. మరే రాష్ట్రంలో కానీ, కేంద్ర పాలిత ప్రాంతంలో కానీ ఈ సంఖ్య పెరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సిజేరియన్ల సంఖ్య 52.2 శాతంగా ఉంది. ఇక నాగాలాండ్‌లో అత్యల్పంగా 13.2 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొన్నది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న ఆపరేషన్ల గురించి కూడా సర్వేలో వెల్లడించారు. తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 83.9 శాతం డెలివరీలు సిజేరియన్ పద్ధతుల్లో జరుగుతున్నాయని, ఇక జాతీయ సగటు కేవలం 54.1 శాతం మాత్రమే ఉన్నట్లు ఆరోగ్య శాఖ చెప్పింది. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా 48.1 శాతం సిజేరియన్ రేట్ ఉన్నట్లు పేర్కొన్నది. ఇక జాతీయ సగటు 16.9 శాతం మాత్రమే. ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి 100 రోజుల వరకు తెలంగాణలోని 81 శాతం మంది గర్భిణులు ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వాడినట్లు రిపోర్టులో తెలిపారు. ఇక జాతీయ సగటు కేవలం 54.9 శాతం మాత్రమే ఉంది.