హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డాలస్ సిద్ధమైంది. పార్టీ 25 ఏండ్ల విజయ ప్రస్థానం పూర్తిచేసుకున్న నేపథ్యంలో జూన్ 1న డాలస్‌లోని డీఆర్ పెప్పర్ వేదికగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. శుక్రవారం డాలస్ ప్రముఖులతో ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల సన్నాహక సమావేశం నిర్వహించారు. యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ ఆధ్వర్యంలో డాలస్ వాసి అనిల్ గ్రంధి నివాసంలో నిర్వహించిన సమావేశంలో దయాకర్ పూసుకురి, సతీశ్ (ఆటా), వంశీ టీటీఏ, రాజ్ పెరిగెల తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ.. రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ హయాంలో డాలస్ని మించి తెలంగాణ అభివృద్ధి చెందిందని ఇక్కడివారు అంటున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ సభకు హాజరుకావడానికి అనేకమంది తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. రజతోత్సవ వేడుకలను ఇత ర దేశాల్లో కూడా నిర్వహిస్తామని తెలిపారు. తన్నీరు మహేశ్ మాట్లాడుతూ.. ఇది బీఆర్ఎస్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.