హైదరాబాద్ మే 15 (నమస్తేతెలంగాణ): కందిపప్పు, పామాయిల్, బెంచీల సరఫరా కాంట్రాక్ట్‌ల తరహాలోనే కోడిగుడ్ల టెండర్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. గురువారంతో టెండర్ల దాఖలుకు గడువు ముగిసింది. టెండర్లు తెరిచి తక్కువకు కోట్ చేసిన వారికి అప్పగిస్తారా? లేదంటే జోనల్ సిస్టంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి డీ సెంట్రలైజ్డ్ (జిల్లాల వారీగా) విధానాన్ని తీసుకువస్తారా? అనే విషయంపై స్పష్టత రావడంలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు పాత టెండర్లను రద్దుచేసి డీ సెంట్రలైజ్డ్ పద్ధతిని తెరపైకి తెచ్చేందుకే కాంగ్రెస్ సర్కారు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది. దీని వెనుక దక్షిణ తెలంగాణకు చెందిన అధికార పార్టీ నేత, మాజీ ఎంపీ చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. పౌల్ట్రీ రైతుల ముసుగులో ఉన్న తన అనుయాయులైన కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ ‘పెద్ద’పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. సదరు నేత సంబంధిత శాఖా మంత్రికి తెలియకుండానే ఈ తతంగం నడిపించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో నగదు ‘చేతు’లు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ పెద్ద తమ అనుయాయులకు మేలు చేసే లక్ష్యంతో జోనల్ సిస్టంను ఎత్తేసి జిల్లా విధానాన్ని తేవాలని నిశ్చయించినట్టు సమాచారం. ఈ క్రమంలో సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతున్నది. జిల్లాలవారీగా టెండర్లు పిలిస్తే అనుకూలురైన పౌల్ట్రీ కాంట్రాక్టర్లకు లబ్ధి కలుగుతుందనే భావనతోనే డీ సెంట్రలైజ్డ్ పద్ధతి వైపు మొగ్గుచూపుతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం మార్చి 30న పాత విధానంలోనే టెండర్లు ఆహ్వానించారు. ఏప్రిల్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, సెలవులు ఎక్కువగా ఉండటంతో గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించారు. అయితే టెండర్ నిబంధనలు పాత పౌల్ట్రీ రైతుల (కాంట్రాక్టర్లు)కు అనుకూలంగా రూపొందించారని వార్తలు రావడంతో రద్దు చేసి నిబంధనల్లో మార్పులు చేశారు. ఇందుకు అనుగుణంగా ఆన్లైన్ దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగించారు. అయితే ఆ ఎంపీ ఒత్తిడితో సర్కారు పెద్ద సూచనల మేరకే రూల్స్‌లో మార్పులు చేసినట్టు ప్రచారం సాగుతున్నది. కాగా జోనల్ సిస్టంలో టెండర్లు పిలవడంతో ఆఫీసర్ల పర్యవేక్షణ అధికంగా ఉంటుంది. దీంతో సరాఫరాలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదని భావించిన సదరు నేత కొంత ఆలస్యంగా మేలుకొని పాత పద్ధతిని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.