Chinna Reddy | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యాలయంలో పనిచేసే సిబ్బంది బాధలు వర్ణణాతీతంగా ఉన్నట్టు సమాచారం. ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి షెడ్యూల్లో సమయపాలన లేకపోవడంతో సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూపులతో గడపాల్సి వస్తున్నదని, తరచూ రాత్రి వేళల్లో పని చేయాల్సిన పరిస్థితి ఉంటున్నదని సిబ్బంది సన్నిహితుల వద్ద వాపోతున్నారు. సమయానికి స్పష్టమైన సూచనలు ఇస్తే తమ పని సులువవుతుందని చెప్తున్నారు. ‘వస్తున్నా.. ఉండండి’ అంటూ ఆదేశిస్తారు.
ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎక్కడికి వెళ్లాలో.. అని కారు డ్రైవర్, ఇద్దరు గన్మెన్లు, మరో ఇద్దరు సిబ్బంది.. అంతా రెడీగా ఉంటాం.. మధ్యాహ్నమైనా రారు.. సాయంత్రం మళ్లీ ఫోన్చేస్తే ‘వస్తున్న ఉండండి..’ అంటూ మళ్లీ చెప్తారు. ‘అందరం ఇంటికి వెళ్దామనే ఆలోచనలో ఉండగా, రాత్రి పదిగంటల ప్రాంతంలో రావడం.. ఫైల్స్, పని అంటూ హడావుడి చేసి.. గంట గంటన్నరలో తిరుగుపయనం అవుతారు. మేమంతా ఇండ్లకు వెళ్లే సరికే అర్ధరాత్రి దాటుతుంది.. నెలలో ఎక్కువ రోజులు ఇదే తంతు.
ఇక్కడ ఉద్యోగం చేయాలంటేనే చిరాకు వస్తున్నది’ అని కొందరు సిబ్బంది మిత్రుల వద్ద ఆరోపిస్తున్నారు. ‘వస్తున్న ఉండండి.. అనే మాట విన్నప్పుడల్లా నా ఓపిక నశించిపోతున్నది. రాత్రి పదిగంటలకు వచ్చేటట్టు ఉంటే.. సాయంత్రం ఆరెడు గంటలకు రమ్మనిచెప్తే అందరం వస్తాంగా.. ఎందుకు ఉదయం నుంచి పడిగాపులు కాయించి చంపటం. ఇదేం ఆనందమో! ఆ మనిషికి? ఇంత మంది దగ్గర పనిచేసినగానీ, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చూడలేదు’ అని సిబ్బంది బంధువుల వద్ద చెప్తున్నారు.