హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావారణశాఖ తెలిపింది. గోపాల్పురం-కళింగ పట్ణణానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా బలపడి బుధవారం అర్ధరాత్రి కళింగపట్నం దక్షిణ తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని పేర్కొన్నారు.
మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మంతోపాటు పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్టు చెప్పారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌తో పాటు నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు పేర్కొన్నారు. ఇక ఈనెల 26న ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని అధికారులు అంచనా వేశారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వానలు కురువొచ్చని అంచనా వేస్తున్నారు.