హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు పెద్ద పెద్ద కంపెనీల యజమానుల పేర్లతో అకౌంటెంట్లను, ఉద్యోగులను మోసం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ ఉన్నతస్థాయి మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలు దొడ్ల దివ్యారెడ్డికి సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చారు. ఆమె 18కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు. ఈ నెల 13న దివ్యారెడ్డి పేరు, ఫొటోతో ఉన్న వాట్సాప్ఖాతా నుంచి అకౌంటెంట్‌కు మెసేజ్ వచ్చిం ది. తాను మీటింగ్‌లో ఉన్నానని, చెప్పి న ఖాతాకు రూ.1.20 కోట్లు పంపించాలని అందులో ఉంది. ఆ మెసేజ్ నిజమేనని నమ్మిన అకౌంటెంట్ మెసేజ్‌లో సూచించిన ఖాతాకు డబ్బు పం పారు. ఈ నెల 17న మరోసారి అదేవిధంగా మెసేజ్ వచ్చింది. ఈ సారి డబ్బులు పంపేముందు అకౌంటెంట్ చెక్ అప్రూవల్ కోసం మహిళా వ్యాపారవేత్తను సంప్రదించారు. తాను డబ్బులు పంపాలని చెప్పలేదనడంతో అంతకుముందు జరిగిన ట్రాన్సాక్షన్ గురించి అకౌంటెంట్ చెప్పాడు. బాధితురాలు 1930 ద్వారా సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణలో భాగంగా ప్రత్యేక బృందాలు కేరళకు వెళ్లినట్టు సమాచారం.