హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమలో మహిళలపై వేధింపుల నివారణకు సినీ, ఇతర మీడియా రంగంలోని బాధ్యులు ముందుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. సమస్య పరిష్కారానికి ప్రామాణికమైన నియమ, నిబంధనలు రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని అన్నారు.
ఆయా రంగాల్లో మహిళలపై వేధింపుల సమస్యల పరిశీలనకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ బుధవారం బీఆర్కే భవన్లో నివేదికను సీఎస్‌కు సమర్పించింది. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న వేధింపులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం నివేదికను సమర్పించిన కమిటీ సభ్యులను సీఎస్ అభినందించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ కల్యాణ్, రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి అనుపమ్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సినీ ఆర్టిస్టులు పాల్గొన్నారు.