Inter Second Language | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): జూనియర్ కళాశాలల్లో సంస్కృతం సబ్జెక్టును ద్వితీయ భాషగా ప్రవేశపెట్టాలన్న ఇంటర్మీడియట్ విభాగం అధికారుల నిర్ణయం వివాదాస్పదం అవుతున్నది. పెద్ద ఎత్తున రగడకు దారితీస్తున్నది. సర్కారు నిర్ణయాన్ని వివిధ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయం తెలుగుభాషకు గొడ్డలిపెట్టులాంటిదని పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. మాతృభాష అయిన తెలుగుకు తీరనిద్రోహం చేయడమేనని హెచ్చరిస్తున్నాయి. ఈ అంశంపై శుక్రవారం మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా స్పందించారు. సంస్కృతాన్ని ద్వితీయభాషగా అమలు చేయాలన్న నిర్ణయంపై ఆయన విచారం వ్యక్తంచేశారు. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం పునరాలోచించాలని ఎక్స్‌లో పోస్టుచేశారు. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదని, మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని ఆయన సూచించారు.
పొంచి ఉన్న ప్రమాదం
ఇంటర్మీడియట్లో సంస్కృతం చాలాకాలంగా అమలవుతున్నది. కార్పొరేట్ కాలేజీలు దాదాపుగా ద్వితీయభాషగా సంస్కృతాన్నే బోధిస్తున్నాయి. సర్కారు కాలేజీల్లో అత్యధికులు తెలుగును తీసుకుంటున్నారు. పదో తరగతి వరకు తెలుగులో చదివిన విద్యార్థులు ఇంటర్‌కు వచ్చేసరికి సంస్కృతాన్ని తీసుకుంటున్నారు. పేరుకు సంస్కృతం తీసుకున్నా.. పరీక్షలను కొందరు తెలుగు, మరికొందరు ఇంగ్లిష్‌లోనే రాస్తున్నట్టు క్షేత్రస్థాయి అనుభవాలు స్పష్టంచేస్తున్నాయి. కానీ సంస్కృతంలో 100కు 99, 98 మా ర్కులేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితు ల్లో సర్కారు కాలేజీల్లో సంస్కృతాన్ని ప్రవేశపెడితే ప్ర యోజనమేమిటన్న వాదనలూ ఉన్నాయి. మార్కుల యావలో అంతా సంస్కృతం తీసుకుంటే తెలుగుకు ప్రమాదం పొంచి ఉన్నట్టేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. తెలుగు కనుమరుగు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మాతృభాషకు గొడ్డలిపెట్టు
ఇంటర్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలి. ఈ నిర్ణయం మాతృభాషకు గొడ్డలిపెట్టులాంటిది. మన మాతృభాష అయిన తెలుగును రక్షించుకోవాలి. తల్లిదండ్రులు, అధ్యాపక సంఘాల అభిపాయాలు తీసుకోకుండా సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది.
– కనకచంద్రం, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసొసియేషన్
ఉపసంహరించుకోవాలి
సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న సర్క్యులర్‌ను ఇంటర్ విద్య అధికారులు ఉపసంహరించుకోవాలి. పదోతరగతి వరకు సంస్కృతం చదవని వారికి ఇంటర్లో ప్రవేశపెట్టడం ఏమిటి. ఈ విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించకుండానే సర్క్యులర్ జారీచేయడం సరికాదు.
– కే సురేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్-475