ఇబ్రహీంపట్నం, మార్చి 18: ఈ నెల 26న చలో రామోజీ ఫిలింసిటీ కార్యక్రమం చేపట్టి, గతంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాల్లోకి వెళ్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యా దయ్య తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో రామోజీ ఫిలింసిటీ భూబాధితులతో సీపీఎం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ, ముదిగొండ అమరవీరుల త్యాగాల స్పూర్తితో 2007లో అప్పటి ప్రభుత్వం నాగన్‌పల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూరు గ్రామాల పేదలకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు జారీచేసిందని తెలిపారు. కానీ, ఆ భూముల్లోకి వెళ్లకుండా రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. పేదలు ఇండ్లు నిర్మించుకుంటామంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, ఎమ్మెల్యే రామోజీ ఫిలింసిటీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ.. పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని శక్తులు అడ్డుకున్నా, ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా, కేసులు నమోదుచేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు.
రామోజీ ఫిలింసిటీ స్థలాల పోరాట కమిటీ ఎన్నిక
15 మంది సభ్యులతో రామోజీ ఫిలింసిటీ పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్‌గా పంది జగన్, కో కన్వీనర్‌గా బుగ్గ రాములు, కమిటీ సభ్యులుగా యాదయ్య, రాములు, రాజు, రాణి, సుమలత, బాలరాజు, ఎల్లమ్మ, కృష్ణ, సంతోష, యాదయ్య, రాములు, బాలమ్మ, బాలరాజు, జంగయ్య, జ్యోతి, మణెమ్మ, భారతమ్మ, సుజాత, సునీ, పాండును ఎన్నుకున్నారు.