హనుమకొండ సిటీ, ఫిబ్రవరి 18: వరుసకు అక్కాచెల్లెళ్లు. కష్టపడి చదివి ఉద్యోగ పోటీ పరీక్షలు రాశారు. ఇద్దరూ ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో ప్రతిభ కనబరిచి చెరో 4 ఉద్యోగాల చొప్పున సాధించి సత్తా చాటారు. ఖిలా వరంగల్‌కు చెందిన హిమబిందు, గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన కొప్పుల చైతన్య కజిన్ సిస్టర్స్. నిరుడు ఆగస్టులో గురుకుల బోర్డు నిర్వహించిన పరీక్షలు రాశారు. మే నెలలో ఇంటర్ విద్య బోర్డు (సాంకేతిక విద్య, పాలిటెక్నిక్) నిర్వహించిన పోటీ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన గురుకుల బోర్డు ఫలితాల్లో వారు డిగ్రీ, జూనియర్, సూల్ మూడు విభాగాల్లో ఎంపికయ్యారు. తాజాగా ఈ నెల 16న ప్రకటించిన పాలిటెక్నిక్, సాంకేతిక విద్య ఫలితాల్లో హిమబిందు మహిళా విభాగంలో రాష్ట్రంలోనే సెకండ్ ర్యాంకు సాధించగా, చైతన్య మొదటి ర్యాంకు సాధించడం విశేషం. ఇద్దరూ నాలుగు ఉద్యోగాలు సాధించినప్పటికీ చివరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ (డిగ్రీ లెక్చరర్) పోస్టును ఎంచుకున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందుకున్నారు. హిమబిందు ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే గురుకుల విద్యాలయానికి, చైతన్య బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించే మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల విద్యాలయానికి ఎంపికయ్యారు.